హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రముఖ కొరియర్ సంస్థ పేరుతో మోసాలకు తెగబడ్డారు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడికి బ్యాంకాక్ నుంచి పార్శిల్ వచ్చిందని ఫోన్ చేశారు. మీపై ముంబయి కస్టమ్స్ కేసు నమోదు చేసిందని తెలిపారు. బాధితుడి ఆధార్ నంబర్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా తెరిచారని, ఆ ఖాతా మనీలాండరింగ్ కేసుకు లింక్ అయి ఉందని చెప్పారు. ఆ తర్వాత కొద్ది సేపటికి స్కైప్ ద్వారా సీబీఐ అధికారి లాగా ఫోన్ చేసిన నేరగాళ్లు.. 17 మంది పిల్లలను కిడ్నాప్ చేసి వారి అవయవాలు అక్రమంగా తరలించిన వ్యవహారంలో కేసు నమోదు చేశామని తెలిపారు.
కస్టమ్స్ అధికారులు సోదాలు చేసి మొత్తం కుటుంబాన్ని అరెస్టు చేస్తారని బెదిరించారు. తండ్రి క్యాన్సర్ పేషెంట్, భార్య ఆరునెలల గర్భవతి కావడంతో భయాందోళనకు గురయ్యాడు. నేరగాళ్లు చెప్పినట్టు చేశాడు. కేసు అవ్వకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని, మళ్లీ 12గంటల్లో తిరిగి ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. దీంతో నేరగాళ్లు తెలిపిన ఖాతాలకు రూ.9.69లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రముఖ కొరియర్ సంస్థ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -