ఈసారి సార్వత్రిక ఎన్నికలు తొలిదశకు ముందే రికార్డ్ సృష్టించాయి. 18వ లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో రూ.
4,650 కోట్ల విలువైన నగదు, బంగారం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయని భారత ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది.
స్వాధీనం చేసుకున్న మొత్తంలో 45 శాతం విలువ మాదక ద్రవ్యాలదే కావడం గమనార్హం. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది.
సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల నుంచి ఏకీకృత నిరోధక చర్యలు, చురుకైన ప్రజల భాగస్వామ్యంతోపాటు ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడంతోనే రికార్డ్ స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్ కమిషన్ వివరించింది.