రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం 348 మంది నామినేషన్లు వేశారు.
ఈ నెల 18న స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవగా మొత్తంగా 895 దాఖలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలతో కోలాహలంగా దాఖలు చేశారు. తొలి పర్వం ముగియటంతో ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది. శుక్రవారం పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఉపసంహరణకు సోమవారం చివరి రోజు. అదే రోజు సాయంత్రంలోగా ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు, అన్రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తుల్లో అర్హులకు ఈ నెల 29న తుది ఓటర్ల జాబితాను రూపొందించి అభ్యర్థులకు అందజేస్తారు.
నియోజకవర్గాల వారీగా చివరిరోజు, మొత్తంగా వేసిన నామినేషన్లు వేసిన అభ్యర్థుల వివరాలివి. మల్కాజిగిరిలో 63(మొత్తం 114)మంది, హైదరాబాద్ 35(57), చేవెళ్ల 30(66), వరంగల్ 24(58), సికింద్రాబాద్ 23(57), మెదక్ 22(54), ఖమ్మం 22(45), పెద్దపల్లి 22(63), జహీరాబాద్ 19(40), నాగర్కర్నూల్ 19(34), కరీంనగర్ 16(53), భువనగిరి 16(61), నల్గొండ 11(56), నిజామాబాద్ 9(42), మహబూబ్నగర్ 8(42), మహబూబాబాద్ 7(30), ఆదిలాబాద్ 2(23) మంది అభ్యర్థుల దాఖలు చేశారు.