వచ్చే సంవత్సరం (2024) సెలవు దినాలను ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది మొత్తం మీద 27 రోజులు సెలవులు లభించనున్నాయి. వీటికి తోడు ఆప్షనల్గా ప్రభుత్వం సూచించిన 25 రోజుల్లో ఏవేని ఐదింటిని వాడుకోవచ్చని పేర్కొన్నది. ప్రతి నెలా సెకండ్ సాటర్ డేను సెలవుగా ప్రకటించినా ఫిబ్రవరిలో మాత్రం వర్కింగ్ గా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. జనవరి ఫస్ట్ న న్యూ ఇయర్ సందర్భంగా తీసుకునే సెలవును దీనితో అడ్జస్ట్ చేసింది. భోగి, అంబేద్కర్ బర్డ్ డే ఆదివారాలు వచ్చాయి. శివరాత్రి పండుగ మార్చి 8న గురువారం రావడంతో ఆ తర్వాతి రోజు (శుక్రవారం) అధికారికంగానే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శనివారం సెకండ్ శాటర్ డే, తర్వాతి రోజు సండే కావడంతో వరుసగా నాలుగు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు హాలీడేస్ వచ్చాయి.
రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) ఏప్రిల్ 11న (గురువారం) రావడంతో ఆ తర్వాతి రోజున కూడా ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ఆ మరుసటి రోజున సెకండ్ శాటర్ , తర్వాత సండే రావడంతో వరుసగా నాలుగు రోజులు హాలీడేస్. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అన్ని కార్యాలయాల్లో కనిపించేలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు క్యాలెండర్లను ముద్రిస్తూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి అధికారిక సెలవుల జాబితా రాకపోవడంతో ప్రింటింగ్కు పంపడానికి ఇన్ని రోజులూ వెయిట్ చేశాయి. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి ప్రకటించడంతో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల మంత్రుల ఫొటోలతో కూడిన క్యాలెండర్లకు సంఘాలు రెడీ అవుతున్నాయి.



