35 ఏళ్ల తర్వాత
అప్పుడు జయలలిత .. ఇప్పుడు విజయ్
చెన్నై, ఏప్రిల్ 2, (వాయిస్ టుడే)
35 Years Later
Then, Jayalalithaa… Now, Vijay.
తమిళనాడు అసెంబ్లీలో దళపతి విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒంటరిగానే పోటీచేస్తున్న తమిళగ వెట్రి కళగం ఏ మేరకు ప్రభావం చూపుతుందో మే 4న తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల నుంచి బరిలో దిగారు. 35 ఏళ్ల తర్వాత ఇలా ఒకే అభ్యర్థి తమిళనాడు ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం గమనార్హం. గతంలో అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మాత్రమే రెండు చోట్ల పోటీచేసి గెలిచారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే చీఫ్, దళపతి విజయ్ ఒంటరిగా దిగి సాహసం చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ శాసనసభ స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. తొలి అడుగులో రాజకీయ స్థిరత్వం కోసం వ్యూహాత్మకంగా విజయ్ అడుగులు వేస్తున్నారు. భారీగా ఉన్న అభిమానగణం ఆయనకు ఓటు బ్యాంకుగా మారతారా? అనే సందేహం అందరిలోనూ ఉంది. అందుకే ఒకచోట ఓడిపోయినా మరోచోట గెలుపు సాధ్యమనే ధీమాతోనే రెండు స్థానాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న నేతగా విజయ్ గుర్తింపు పొందారు. తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయొచ్చు. ఆ రెండు చోట్లా గెలిస్తే ఏదో ఒక దానికి మాత్రం రాజీనామా చేయాలి. 1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బర్గూర్, కాంగేయం నుంచి పోటీచేసిన జయలలిత .. రెండింటిలోనూ విజయం సాధించారు. దీంతో కాంగేయం సీటును వదులుకుని బర్గూర్ ఎమ్మెల్యేగా అమ్మ కొనసాగారు. సరిగ్గా మూడున్నర దశాబ్దాల తర్వాత రెండు అసెంబ్లీ స్థానాల నుంచి విజయ్ బరిలోకి దిగుతుండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో తనకు, అధికార డీఎంకే మధ్యనే పోటీ జరుగుతుందని విజయ్ ప్రకటించారు. ఇక, అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే టీవీకే సైతం ప్రజాకర్షక హామీలను ప్రకటించింది. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలను ఉల్లంఘించేలా ఏకంగా నాలుగు చోట్ల జయలలిత నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణగిరి, భువనగిరి, ఆండిపట్టి, పుదుకోట్టై నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కానీ, టాన్సీ భూముల కేసులో ఆమె దోషిగా నిర్దారణ అయి శిక్ష ఖరారు కావడంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే, 2006 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి డీఎండీకే అధ్యక్షుడు, కెప్టెన్ విజయకాంత్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన కేవలం విరుదునగర్ నుంచి మాత్రమే పోటీచేసి విజయాన్ని అందుకున్నారు.



