లైట్లు అన్ని ఆపేశారు. చిమ్మ చీకటి.. ఒకే సారి 450 డ్రోన్లు ఆకాశంలోకి లేచాయి. అంతే ఆకట్టుకునే రీతిలో పలు ఆకృతులను ప్రదర్శించాయి. 20 నిముషాల పాటు ఖమ్మం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ పార్కులో డ్రోన్లతో ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కూపాలుగా ఉన్న ఈ ప్రదేశ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి ఈ రోజు ఇక్కడ ఇలాంటి సందడి జరుపుకుంటున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. డ్రోన్ షోకు ముందు, తర్వాత నిర్వహించిన సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ప్రదర్శనను తిలకించేందుకు స్థానికులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో మమతా రోడ్డులో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా పర్యాటకశాఖ ఆధ్వర్యాన ప్రదర్శించిన డ్రోన్ షోను ఖమ్మంలోనూ ఏర్పాటుచేయాలని భావించగా ఇప్పుడు ఆ కల నెరవేరిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.




