అత్యధికం గజ్వేలు.. అత్యల్పం నారాయణపేట
హైదరాబాద్, నవంబర్ 14, (వాయిస్ టుడే) : తెలంగాణ దంగల్‌లో మరో ఘట్టం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఇవాళ పూర్తయింది. దీంతో నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 15 వరకు గడువు ఉంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్‌లో 145 నామినేషన్లు దాఖలైతే, అత్యల్పంగా నారాయణపేటలో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో పలువురు కీలక నేతల నామినేషన్లు కూడా తిరస్కరణ అయినట్లు తెలుస్తోంది. అయితే, నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలనలో జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురయినట్లు పేర్కొంటున్నారు.ఈ నెల 30న పోలింగ్ జరనుంది.. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఇదిలాఉంటే.. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన 166 మంది అబ్జర్వర్లను పరిశీలన కోసం ఈసీ నియమించింది. వీళ్లలో 67 మంది ఐఏఎస్‌లను సాధారణ పరిశీలకులుగా నియమిస్తే, 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. 60 మంది ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు.
గద్వాల అలంపూర్ ఆర్‌వో ఆఫీస్ దగ్గర ఆందోళన జరిగింది. రిటర్నింగ్ అధికారి వాహనాన్ని అభ్యర్థులు అడ్డుకున్నారు. BRS అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విజేయుడు, తన పదవికి రాజీనామా చేయకుండా పోటీచేస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు.ఖమ్మంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తన ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి.. పువ్వాడ అజయ్ కుమార్ అఫిడవిట్ ఫార్మాట్‌కు అనుగుణంగా లేదంటూ ఈసీకి తుమ్మల కంప్లయింట్ ఇచ్చారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవరూ లేకపోతే.. నిల్ అని రాయకుండా మార్చారని తుమ్మల ఆరోపించారు. ఆర్‌వో ఎన్నికల నిబంధనలు పాటించలేదంటూ పేర్కొన్నారు.నామినేషన్ల ఉపసంహరణకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు రెబల్ అభ్యర్థులపై దృష్టిసారించాయి. టికెట్ దక్కకపోవడంతో పోటీ చేస్తున్న వారిని ఎలాగైనా ఉపసంహరించుకునేలా చేసేందుకు కసరత్తులు చేస్తున్నాయి.