వారసులమంటూ బరిలోకి దిగనున్న యువ నాయకులు
టికెట్ మాదేనని ఎవరికీవారే ప్రచారం చేస్తున్న వైనం
కోరుట్ల కాంగ్రెస్ లో టిక్కెట్ల పంచాయితీ
టిక్కెట్ కోసం నర్సింగరావు, సుజిత్ రావు, కరంచంద్ ల పోటీ
కోరుట్ల తెరపైకి మామిడి సిద్ధార్థ రెడ్డి

జగిత్యాల జిల్లా బ్యూరో(జూలై27,23)వాయిస్ టుడే: రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఆయా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావాహులు ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి అన్ని నియోజకవర్గాల్లో తారాస్థాయికి చేరుకుంటోంది.
అయితే ఈసారి ఎక్కువ నియోజకవర్గాల్లో రాజకీయ నేతల వారసులు రంగంలోకి దిగెందుకు ఆసక్తి చూపుతున్నట్టు ఆదిశలో వారు నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై శుభ, అశుభ కార్యాలకు వెళ్లి పరామర్శిస్తువస్తున్నారు.
సీనియర్ నేతలు తాము పక్కకు జరిగి, తమ వారసులను బరిలోకి దించే యోచనలో సర్వం ఒడ్డేందుకు సిద్ధమవుతున్న వేళ జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కొట్లాట రసకందాయంగా మారనున్నది.
నిన్నటి వరకు తండ్రుల మధ్య రాజకీయ పోరుంటే నేడు అది తనయుల పోరుగా మారుతోంది.
రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. అన్ని పార్టీల్లో వారసుల రాజకీయ రంగప్రవేశం ఈ ఎన్నికల్లో జరుగనున్నది.
కోరుట్ల నియోజకవర్గంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారసులు కావడం విశేషం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరపున ఇక్కడ బరిలోకి దిగేది తమ తండ్రుల రాజకీయ వారసత్వం తీసుకున్న కొడుకులే కావటం విశేషం. భారత రాష్ట్ర సమితి నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ కె.వి రాజేశ్వరరావు వారసుడిగా కల్వకుంట్ల సుజిత్ రావు, మాజీ దేవదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తనయుడు కొమిరెడ్డి కరంచంద్, సర్వీసుల గంగారెడ్డిగా ఇక్కడి వారికి పరిచయమున్న ఆయన మనుమడు, కోరుట్ల పట్టణానికి చెందిన మామిడి జస్వంతి సిద్ధార్థ రెడ్డి, బిజెపి నుండి సురభి భూం రావు తనయుడు సురభి నవీన్ కుమార్, పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. కోరుట్ల అసెంబ్లీ కాంగ్రెస్ టిక్కెట్ మాదేనని ఎవరికీ వారే ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు.
ఈ దిశలో వారు తమ ఆలోచనలకూ పదునుపెడుతూ ఎన్నికల గోదాలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు వారసుడు నర్సింగరావు కోరుట్ల నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందగా ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగిడాలన్న పట్టుదలతో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాగే కల్వకుంట్ల సుజిత్ రావు సైతం నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలను కలుస్తూ తాను సైతం టిక్కెట్ రేసులో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు కుమారుడు కరంచంద్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటూ నాన్న ఆశయాలను కొనసాగించడానికి ఈసారి కోరుట్ల బరిలో నిలిచి గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. అలాగే కోరుట్ల బరిలో నిలిచేందుకు కోరుట్ల పట్టణానికి చెందిన సర్వీసుల గంగారెడ్డి గా ఇక్కడి ప్రాంతానికి సూపరిచుతుడైన, రైతు నాయకుడు గంగారెడ్డి మనుమడు మామిడి జస్వంతి సిద్ధార్థ రెడ్డి సైతం కోరుట్ల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాత గంగారెడ్డి కున్న మంచి పేరుతో పాటు కోరుట్ల ప్రజలు, రైతులు, అన్నివర్గాల వారితో ఉన్న సత్సంబంధాలను బేరిజువేసుకుని తాను సైతం సమరానికి “సై”అంటూ పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యుల అండతో యువ నాయకుడిగా కోరుట్ల అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధార్థ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. టిక్కెట్ కోసం పోటీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా
ఇక్కడి మహిళా ఓటర్లను అకర్శించుకునేందుకు సిద్ధార్థరెడ్డి భార్య జస్వంతిని పోటీలో నిలిపెందుకు కూడా సిద్ధమైనట్లు “కోమటిరెడ్డి” అండతో పావులు కదుపుతున్నట్లు ఆదిశలో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కోరుట్ల అసెంబ్లీ సిటు విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికీ వారే టిక్కెట్ కోసం తమకున్న సంబంధాలతో పావులు కదుపుతుండడంతో కోరుట్ల రాజకీయాలు వేడెక్కుతుండగా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ విషయంలో అధిష్టానానికి తలనొప్పిగా మారానున్నది. మరో నాలుగు నెలలు ఆగితే ఎవరిని టిక్కెట్ వరిస్తుందో, బరిలో నిలిచి గెలుస్తారో వేచిచుడాల్సిందేనన్న చర్చ కోరుట్లలో జోరుగా నడుస్తోంది.


