టి–కాంగ్రెస్.. అనైక్యతే మైనస్
పార్టీలో మళ్లీ మొదలైన అనైక్యత రాగాలు
ఒకరిపై ఒకరు పరోక్ష నిందలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో బట్టబయలు
మేడి పండు చందంగా పార్టీ పరిస్థితి
హైదరాబాద్: ‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఏ నాయకుడైనా తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసుకోవచ్చు. అంతమాత్రానా.. గ్రూప్ రాజకీయాలు, ఐక్యత లేదు అనే మాటలు సరికాదు’.. టి–కాంగ్రెస్ నేతల నుంచి తరచు వినిపించే మాటలు.
అయితే వాస్తవంలో మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట నాయకులు అనైక్యత రాగాలు వినిపించడం పరిపాటిగా మారింది. దీంతో.. కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత వస్తుందా? అనే చర్చ మొదలైంది.
ఉత్తమ్.. తాజా ఎపిసోడ్‌తో
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఐక్యత ఉండట్లేదు అనడానికి తాజా నిదర్శనం.. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలే. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించిన సందర్భంలో.. ఆయన మాట్లాడుతూ పార్టీలోని ఒక కీలక నేత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాకే చెందిన రెడ్డి సామాజిక వర్గ నేత పేరునే ఈ విషయంలో చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా.. ఉత్తమ్ ముందుగా తన భార్యను బీఆర్‌ఎస్‌లోకి పంపుతారని.. తర్వాత తాను కూడా చేరతారనే కథనాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అనైక్యత, గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి.
అనైక్యత ఆయుధంగా.. బీఆర్‌ఎస్ అడుగులు
కాంగ్రెస్ పార్టీలోని అనైక్యతను తమకు ఆయుధంగా మలచుకోవాలని అధికార బీఆర్‌ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌లోని అసంతృప్తులను గుర్తించి తమ పార్టీలో చేరే విధంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు బీఆర్‌ఎస్ తెరదీస్తోంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకులు, కౌన్సిలర్లకు ఆయన గాలం వేస్తున్నారు. ఈ విషయలో ఈయన మంత్రాంగం ఫలించి భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇతర జిల్లాల్లోనూ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని అధికార బీఆర్‌ఎస్ సంధిస్తోంది. దీనికి ఆశించిన స్థాయిలో స్పందన కనిపిస్తుండడం విశేషం. ‘జిల్లాల స్థాయిలో కాంగ్రెస్‌లో ఎందరో టికెట్ ఆశావాహులు ఉంటున్నారు. వారందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అంతేకాకుండా అన్ని జిల్లాల్లోనూ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో తమకు భవిష్యత్తు లేదనుకునే నేతలు పక్క చూపులు చూస్తున్నారు.’ అనేది కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు, నేతల మధ్య ఐక్యత లేమిపై విశ్లేషకుల అభిప్రాయం.
“చేతి” నిండా నేతలు.. టికెట్ల ఇక్కట్లు
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల నుంచి చేరికల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భువనగిరి స్థానం నుంచి టికెట్ హామీతో కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి వంటి నేతలు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇలా వలస నేతలతో.. హస్తం పార్టీ మొత్తం ఇప్పుడు నేతలతో నిండిపోయింది. అందరికీ టికెట్ ఇవ్వడంలో రానున్న రోజుల్లో ఇక్కట్లు ఏర్పడతాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీలో చేరిన వారంతా టికెట్ హామీతోనే అడుగు పెడుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయా జిల్లాలు, నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు అలకబూనడం, గ్రూప్ రాజకీయాలకు తెరదీయడం వంటి పరిస్థితులు ఏర్పడతాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు పార్టీలో నేతల మధ్య అనైక్యతకు కారణం అవుతుందనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
నోట నవ్వులు.. నొసట వెక్కిరింపులు
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సాన్నిహిత్యాన్ని పరిశీలిస్తే.. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం అనే సామతె గుర్తుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా మీడియా ముందు ఐక్యంగా ఉన్నామని సంకేతాలిచ్చేలా చేయి, చేయి కలిపే నేతలు.. తర్వాత ఒకరి వెనుకాల ఒకరు గుంతలు తవ్వుతున్నారనే అపవాదు పార్టీలో నెలకొంది. ముఖ్యంగా తామెంతో సీనియర్లమని చెప్పుకునే నేతలు.. పార్టీ అభివృద్ధికి బదులు వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో పార్టీలో నేతల మధ్య అనైక్యత క్రమేణా పెరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రేవంత్‌పై.. ఎంతో అసంతృప్తి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌పై దూకుడుగా వ్యవహరించే రేవంత్‌కు ఆయన సొంత నియోజకవర్గం మల్కాజ్‌గిరిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను చూపి కొందరు నేతలు ఆయన నాయకత్వంపై లోలోన ప్రశ్నించుకుంటున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉందని.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. అయిదింటిలో పార్టీ ఆనవాళ్లు లేవని సర్వేలు పేర్కొంటున్నాయి. మరోవైపు.. రేవంత్ రెడ్డి కనిపించట్లేదంటూ పోస్టర్లు సైతం వెలిశాయి. దీంతో.. ఇంట గెలవలేని వ్యక్తి పార్టీని ఎలా గెలిపిస్తాడని.. పార్టీలోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. అయితే.. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోనే రేవంత్‌కు వ్యతిరేక వర్గాలను కొందర రాష్ట్ర స్థాయి నేతలు ప్రోత్సహిస్తున్నారని.. రేవంత్‌కు రాహుల్ వద్ద ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఉద్దేశం ఇందులో ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉచిత కరెంట్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి ప్రత్యర్థుల నిరసనలను తక్షణమే అధిష్టానం చెవిన చేరవేయడం కూడా రేవంత్ రెడ్డిని బలహీనపరచాలనే ఉద్దేశంతో పార్టీలోని కొందరు నేతలు వ్యవహరించారనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి.
టికెట్ల వేళ.. కలహాల గోల
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫార్ములాను అనుసరిస్తూ.. మరికొద్ది రోజుల్లో టికెట్ల కేటాయింపును చేపట్టనుంది. దీంతో.. ఆ సమయంలో పార్టీలో కలహాలు మరింత పెరుగుతాయని.. వాటిని ప్రత్యర్థి పార్టీలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రమాదం ఉందని పార్టీ గెలుపు కోరుకుంటున్న నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం ముందుగానే మేల్కొని టికెట్ ఇవ్వలేని నేతలను బుజ్జగించే పని చేపట్టాలని లేదంటే పునర్‌వైభవం దిశగా కదులుతున్న పార్టీ మళ్లీ కుదేలవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మొత్తంమీద ఒకవైపు గ్రాఫ్ పెరుగుతోందనే జోష్‌లో ఉన్న పార్టీలో మళ్లీ గ్రూప్ రాజకీయాలు మొదలు కావడంతో నేతల్లో, ప్రజల్లో.. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదా? అనే చర్చ జరుగుతోంది.