బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు 10: కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామని అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ప్రాజెక్టు కట్టేందుకు రూ.86 వేల కోట్లను తామే ఇచ్చామని పార్లమెంటులో ప్రకటించింది. తామేదో ఉత్తుత్తిగనే చెప్పడంలేదని, సాధికారికంగా చెప్తున్నామంటూ లోక్‌సభలో అధికార పార్టీ ఎంపీ దూబే చెప్పారు. బుధవారం లోక్‌సభలో బీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధు లు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు. నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కూడా కేంద్రం బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ఇదేనా కేంద్రం అనుసరించే సమాఖ్యస్ఫూర్తి అని నిలదీశారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన జార్ఖండ్ ఎంపీ నిశికాంత్ దూ బే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి మాట్లాడారు. నామా ఆరోపణలు సరికాదని, కేంద్ర ప్రభు త్వం కాళేశ్వరం నిర్మాణానికి రూ.86 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. తాను కేంద్రం తరఫునే ఈ విషయం చెప్తున్నానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అందుబాటులో లేకపోవడంతో తాను జోక్యం చేసుకొని చెప్తున్నానని వెల్లడించారు. దీంతో దూబే సభకు తప్పుడు సమాచారం ఇస్తూ పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. గురువారం దూబే పార్లమెంట్ వేదికగా అబద్దాలు చెప్పారని ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. 2021 జూలై 22న లోక్‌సభలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించుకున్నారని పార్లమెంట్ లోనే చెప్పారని ప్రివిలేజ్ నోటీసులో బీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం ఇవ్వలేదని తేల్చిచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని కూడా స్పష్టంగా చెప్పారు. 2022 జూలై 31న, డిసెంబర్ 15న కూడా షెకావత్ లోక్‌సభలో ఇదే సమాధానం ఇచ్చారు. రుణాలను రాష్ట్ర ప్రభు త్వం సమీకరించుకొని ప్రాజెక్టును నిర్మించుకొన్నదని, ఆర్బీఐ నిబంధనలకు లోబడే ఈ ప్రాజెక్టుకు రుణాలు తీసుకొన్నదని వివరించారు. తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలని, ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని, కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అనేకసార్లు కోరారు. అయినా కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సేకరించింది. ప్రభుత్వ ఖాజానా నుంచి కూడా ఖర్చు చేసి రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తిచేసిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.