యోగికి పాదాబివందనం తప్పేంటి
చెన్నై, ఆగస్టు 22: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ‘జైలర్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే జైలర్ రిలీజ్ కి ముందు రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ఆయన ఈమధ్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ యోగి ఆదిత్య నాథ్ ని చూడగానే వెంటనే ఆయన కాళ్లు మొక్కారు. దీంతో ఇది కాస్త వివాదాస్పదంగా మారింది.లక్నోలో సీఎం ఆదిత్యనాథ్ ఇంటి ముందు రజనీకాంత్ కారు దిగిన వెంటనే తనకు స్వాగతం పలకడానికి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కాళ్ళను తాకడానికి వంగడం, వెంటనే యోగి ఆదిత్యనాథ్ సైతం రజనీకాంత్ ని ఇలాంటివి వద్దని చెప్పేలోపే ఆయన పాదాలకు నమస్కారం చేయడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అంతే అప్పటినుంచి రజనీకాంత్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.తనకంటే వయసులో చిన్నవాడైన సీఎం యోగి కాళ్ళను రజనీకాంత్ మొక్కడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోలర్స్ నానా హంగామా చేశారు. మరోవైపు రజనీకాంత్ చేసిన ఈ పని ఆయన అభిమానులకు కూడా ఆగ్రహం తెప్పించింది. వయసులో పెద్ద, అలాగే ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఒక రాజకీయ నాయకుడు, పైగా వయసులో తనకంటే 20 ఏళ్లు చిన్నవాడి కాళ్ళు మొక్కడాన్ని ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు రాజకీయపరంగా కూడా దీనిపై ఎన్నో రకాల విమర్శలను లేవనెత్తారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు ఈ విషయంపై రజనీకాంత్ స్పందించనే లేదు.అయితే తాజాగా తన ఆధ్యాత్మిక ట్రిప్ ముగించుకొని నేడు చెన్నై ఎయిర్ పోర్ట్ లో రజనీకాంత్ అడుగు పెట్టడమే ఆలస్యం ఇదే ప్రశ్నతో రిపోర్టర్లు తెగ రచ్చ చేశారు. దీంతో రజనీకాంత్ దీనిపై మీడియా ముందు స్పందించారు. “ఎవరైనా నాకంటే చిన్నవారైనా వారు యోగి లేదా స్వామీజీ అయినా వారి కాళ్లపై పడి ఆశీర్వాదం పొందడం నా పద్ధతి” అంటూ తనదైన శైలిలో ఒక్క మాటతో తేల్చేశారు సూపర్ స్టార్. ఇక ఆయన మాటలతో ఆ విమర్శలన్నీ ఒక్కసారిగా పటా పంచలు అయిపోయాయి. ఇక రజిని మాటలు విన్న పలువురు ఫ్యాన్స్ ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, వయసులో చిన్న వాళ్ళయినా పెద్దవాళ్ళైనా స్వామీజీ, యోగులు కనబడితే ఎవరైనా కాళ్ళు మొక్కుతారు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన ‘జైలర్’ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దర్శకుడు నెల్సన్ సినిమాలో రజనీకాంత్ ని చూపించిన విధానం, అలాగే సూపర్ స్టార్ యాక్షన్,, స్టైల్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. చాలాకాలం తర్వాత వింటేజ్ రజిని చూసి ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో జైలర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం పది రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ‘2.ఓ’, ‘పొన్ని యన్ సెల్వన్’ సినిమాల తర్వాత రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన మూడో తమిళ చిత్రంగా ‘జైలర్’ నిలిచింది.