కుప్పంలో డెడ్ బాడీ హోమ్ డెలివరీ
తిరుపతి, ఆగస్టు 26 అక్రమ సంబంధాలు పచ్చటి కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. ప్రాణాలు తీసుకోవడంతో పాటు తీసేలా చేస్తున్నాయి. అంతేనా అనేక మందిని అనాథలుగా మారుస్తున్నాయి. వయసుతో, వావి వరసలతో సంబంధం లేకుండా కొందరు మూర్ఖులు విచ్చల విడిగా అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తనకంటే పెద్ద వయసు కలిగిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. ప్రాణాలు పోయేలా చేసింది.చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. యువకుడు మృతదేహాన్ని ఇద్దరు మహిళలు తన ఇంటికి డోర్ డెలివరీ చేయడం ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుప్పం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు… చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడి కొత్తూరు గ్రామానికి చెందిన వినోద్ బెంగళూరులో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మూడు నెలలకు ఒకసారి గ్రామానికి వచ్చి కొద్ది రోజులు పాటు తల్లిదండ్రుల వద్ద, గ్రామంలో ఉండి తిరిగి మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో వినోద్ కు కుప్పం వాసి ఓ 53 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం కాస్తా అక్రమ సంబంధంకు దారి తీసింది. వినోద్ కి పెళ్లి కాకపోవడంతో తరచుగా కుప్పం వచ్చి ఆ మహిళతో ఎంజాయ్ చేసేవాడు. అయితే ఈ విషయం కాస్తా ఆ మహిళ భర్తకు, బంధువులకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన మహిళ బంధువులు వినోద్ కు వార్నింగ్ ఇచ్చారు. కానీ వినోద్ వారి మాటలను లెక్క చేయకుండా తరచూ కుప్పం వచ్చి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు యథావిధిగా నాలుగు గంటల సమయంలో గుడికొత్తూరు గ్రామంలో ఉన్న వినోద్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వినోద్ ఇంటి నుంచి కుప్పంకు బయలుదేరాడు. కుప్పంలోని ప్యాలెస్ రోడ్ లో ఉన్న ఓ లాడ్జిలో ఓ గదిని బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ శుక్రవారం ఉదయం ఇద్దరు మహిళలు వినోద్ కి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ ప్రైవేటు అంబులెన్స్ లో లాడ్జి నుంచి కుప్పంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించడంతో వినోద్ మృతదేహాన్ని ఇద్దరు మహిళలు ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో గుడికొత్తూరు గ్రామం అంతా తిరిగారు. ఇలా కొంతసేపటికి వినోద్ మృతదేహాన్ని తన ఇంటి వద్ద వదిలిపెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. అయితే విగత జీవిల ఇంటి ముందు పడి ఉన్న వినోద్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు కుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి వినోద్ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.వినోద్ మృతదేహంకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు గురువారం 6 గంటల ప్రాంతంలో వినోద్ మృతి చెందినట్లు ధృవీకరించారు. అయితే వినోద్ ది హత్య లేక అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కేసులో మరిన్ని విషయాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.