జీ 20 సదస్సకు సిద్ధమవుతున్న ఢిల్లీ

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 వ తేదీల్లో G 20 సదస్సు జరగనుంది. మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సదస్సుని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అందుకే…భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ విధించనున్నారు. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుందీ ఈ సమ్మిట్. ఈ రెండు, మూడు రోజుల పాటు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకుండా పూర్తిగా లాక్‌డౌన్ పెట్టారు. అంతే కాదు. పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. ఆ రెండు రోజుల పాటు వ్యాపారాలూ బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రావడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ, NCR ప్రాంతాల్లోని హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్స్‌తో బిజీగా ఉన్నాయి. ITC Maurya, తాజ్ ప్యాలెస్, ది ఇంపీరియల్ సహా పలు ఫైవ్ స్టార్ హోటళ్లలోని రూమ్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్‌లో స్టే చేయనున్నారు. G 20 వెన్యూ వద్ద 50 ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచనున్నారు. మెడికల్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. హోటల్స్, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవ్వాలని కేంద్రం ఆదేశించింది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తితే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని తేల్చి చెప్పింది. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వద్ద ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పాటు AIIMS వద్ద కూడా ఏర్పాట్లు చేశారు. లేబర్ కమిషనర్ ఆఫీస్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలోని వ్యాపారులందరికీ నోటీసులు పంపింది. జీ20 సదస్సు జరిగే తేదీల్లో దుకాణాలు మూసి వేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగులకు పెయిడ్ హాలీడే ఇవ్వాలని పలు కంపెనీలను ఆదేశించింది. భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే దశల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఈ మొత్తం ఏర్పాట్లకూ ఢిల్లీ పోలీసులే బాధ్యత వహిస్తున్నారు. CRPFకి చెందిన 50 టీమ్స్‌కి చెందిన 1000 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 300 బులెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధం చేశారు. ఈ మూడు రోజుల పాటు ఢిల్లీలోని స్కూల్స్, కాలేజీలు మూతపడనున్నాయి.

పార్కులలో జీ 20 ధీమ్
G 20 సదస్సుకి ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీలోని మున్సిపల్ పార్క్‌లో అతి పెద్ద థీమ్ లోగోతో పాటు జీ20లోని సభ్య దేశాల జాతీయ పతాకాలనూ ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రత్యేకంగా 20 స్తంభాలు అరేంజ్ చేశారు. గ్రేటర్ కైలాశ్‌లో ఉన్న ఈ ప్రాంతంలోని పార్క్‌ని ఇలా అలంకరించారు. సదస్సుకి వచ్చే అతిథులు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చూడడమే తమ ఉద్దేశమని స్థానిక ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. సెప్టెంబర్ 9-10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఢిల్లీలోని రోడ్లన్నీ అలంకరించారు. ఎక్కడా చెత్త కనబడకుండా క్లీన్ చేశారు. గోడలపై కొత్త పెయింట్స్ వేశారు. ఈ క్రమంలోనే పార్క్‌ని G 20 థీమ్‌తో అలంకరించారు. ప్రస్తుతం స్థానికులు ఈ పార్క్‌ని G 20 పార్క్‌గా పిలుస్తున్నారు.”20 స్తంభాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కాంక్రీట్ మిక్స్‌తో పాటు వుడెన్ టెక్ట్స్‌చర్‌తో వీటిని తయారు చేశాం. ప్రతి పిల్లర్‌పైనా G 20 దేశాల్లోని ప్రతి ఒక్క దేశానికీ ఓ జెండా అమర్చాం. ఇద్దరు ఆర్టిస్ట్‌లతో పాటు పది మంది కూలీలు ఇందుకోసం శ్రమించారు. ఈ పార్క్ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.”అయితే…ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ నుంచే ఖర్చు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ నిధులనే వినియోగించినప్పటికీ పెద్దగా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. G 20 థీమ్ లోగో వెనకాల వరల్డ్ మ్యాప్ గీశారు. ఇక్కడికి వచ్చి వెళ్లే అతిథులు ఎప్పుడూ తమ ఆతిథ్యాన్ని మర్చిపోకూడదని, అందుకే ఇంతగా శ్రద్ధ పెడుతున్నామని వెల్లడించారు ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్. ఢిల్లీలోని పలు చారిత్రక కట్టడాలకూ పెయింట్స్ వేసి అందంగా తీర్చి దిద్దనున్నారు.




