నళిని చిదంబరానికి ఇచ్చిన వెసులుబాటు నాకు ఇవ్వండి : కవిత
కవితకు 10 రోజులు గడువు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటీషన్ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్డులో కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారంటూ కవిత ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని ఆమె పిటీషన్ లో కోరారు. నళిని చిదంబరానికి ఇచ్చిన వెసులుబాటు తనకు ఇవ్వాలని కవిత తన పిటీషన్ లో కోరారు. సుప్రీంకోర్టు ఇదివరకు కొన్ని ఆదేశాలు జారీ చేసిందని.. అందులో మహిళల్ని విచారణ కోసం ఒత్తిడి చేయవద్దని పేర్కొందని కవిత తరపు లాయర్ వాదించారు. ఈ మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు చెప్పిందని తెలిపిదంి. నళిని చిదంబరం విషయంలో కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు విచారణ కోసం ఒత్తిడి చేయవద్దని కోర్టు చెప్పిందని.. ఇదే తరహా ఆదేశాలను కవితకు కూడా వర్తింప చేయాలన్నారు. మరో కేసులో కస్టమ్స్ యాక్ట్ అంశంలోనూ మహిళలపై కఠినంగా వ్యవహరించవద్దు అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మనీలాండరింగ్ చట్టంలో కూడా మహిళలకు రక్షణ కల్పించాలని చెబుతోందని.. బెయిల్ కోసం ఉద్దేశించిన సెక్షన్ 45లో కూడా మహిళలకు వెసులుబాటు కల్పించాలని ఉందని కవిత తరపు లాయర్ తెలిపారు. కాబట్టి మహిళలను ప్రత్యేక కేటగిరీగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై తుది ఉత్తర్వులు వెలువడాలి. ఫైనల్ హియరింగ్ కోసం డేట్ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు ఈ సమన్లను వాయిదా వేయాలని కోరారు. అయితే తాము 10 రోజులు ముందుగా చెబుతాం అన్నాం. ఆ మేరకు 10 రోజుల సమయం ఇచ్చామని ఈడీ తెలిపింది. కవిత ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఆమె బిజీగా ఉంటే, మరో 10 రోజులు సమయం పొడిగిస్తామని ఈడీ తెలిపింది. అంతే తప్ప సమన్లను నిరవధికంగా వాయిదా వేయడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు విజ్ఞప్తి మేరకు కేసు విచారణ సెప్టెంబర్ 26కు వాయిదా వేస్తున్నామని.. అప్పటి వరకు సమన్లు వాయిదా వేయాలని మేము రికార్డు చేయాలా అని ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. అవసరం లేదు. మేము వాయిదా వేస్తామని ఈడీ చెప్పింది. దీంతో కవితకు మరో పది రోజుల పాటు ఊరట లభించించినట్లయింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు సెప్టెంబర్ 14న మరోసారి నోటీసులిచ్చింది. సెప్టెంబర్ 15న విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని కవిత ఇంటికి నోటీసులు పంపగా..మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కవితనీ ఈడీ అధికారులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు సార్లు విచారించింది.