దిక్కుమాలిన రాజకీయాలు మానండి- పార్టీలకతీతంగా ప్రజలకు మేలు చేయండి
మాజీ ఏమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
నర్సంపేట ( వాయిస్ టుడే ): వాయిస్ పంట నష్టం పరిహారం ముసుగులో రాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని నర్సంపేట మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరితేనే ప్రయోజనాలు అందుతాయని ప్రజలకు ఎర వేస్తున్నారని అయన విమర్శించారు. భూమిలేని బీఆర్ఎస్ కార్యకర్తలకు సైతం పంట నష్టం పరిహారం చెక్కులు అందించి, ఇతర పార్టీల్లో ఉన్న నిజమైన లబ్ధిదారులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పంట నష్టం పరిహారం ఏది అంటూ అడిగిన అర్హులైన రైతులపై కేసులు బనాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గులాబీ జెండా కిందికి వస్తేనే బీసీ బంధు, దళిత బంధు వంటి పథకాలు వర్తిస్తాయని ప్రజలకు చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడటం ఎమ్మెల్యే పెద్ది నీతికి నిదర్శనం అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి పంట నష్టం పరిహారం విషయంలో పార్టీలకతీతంగా వ్యవహరించానని ఈ సందర్బంగా అయన గుర్తు చేశారు. కుట్రపూరిత, స్వార్థ రాజకీయాలు మానుకొని ప్రజలందరికీ మేలు కలిగేలా వ్యవహరించాలని ఎమ్మెల్యే పెద్దిని డిమాండ్ చేశారు. తొగరు చెన్నారెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గుర్తుకురాని కేసులు ఇప్పుడు పార్టీ మారితే గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా చోద్యం చూసి ప్రస్తుతం హడావిడిగా అరెస్టులు, కేసులు అంటూ హంగామా చేస్తున్నారని అన్నారు. చెన్నారెడ్డి చేసిన తప్పుకు తనను సమర్ధించడం లేదని, కేసు ఏడాదిన్నర తర్వాత ఫైలు ఎందుకు రాజకీయ కోణంలో వెలికితీస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రజల కోసం నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగిపోతే వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయని, ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు వ్యవస్థలను దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అధికారులతో కలిసి నియోజకవర్గన్ని అభివృద్ధి చేశానని అయన అన్నారు



