దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు చేసింది. నవంబర్ 23న జరగాల్సిన పోలింగ్ తేదీని నవంబర్ 25కి మారుస్తూ బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది..
తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు అక్టోబర్ 9న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23(గురువారం) జరగాల్సి ఉంది. అయితే, నవంబర్ 23న రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వివాహాలు/శుభకార్యాలు/ సామాజిక కార్యక్రమాలు ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బంది కలుగుతుందని, పోలింగ్ తేదీని మార్చాలంటూ పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీ తెలిపింది. అలాగే, రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉండొచ్చని.. అందువల్ల పోలింగ్ తేదీ మార్చాలంటూ మీడియా సంస్థల వేదికగా వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 25కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది..