దేవాలయానికి తండోపతండాలుగా తరలివస్తున్న భక్జనం
మహేశ్వరం, వాయిస్ టుడే: కొలిచిన వారి కొంగుబంగారమై విరజిల్లుతున్న రావిరాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ప్రతి మంగళవారం వేలాదిమంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొందుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా తో పాటు పరిసర జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి ఎల్లమ్మ తల్లికి బోనాలు, మొక్కులను చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్.శ్రీనివాసరావు తెలిపారు. సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఆపద వచ్చినా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే తమ ఆపదలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారని వివరించారు. దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే భవిష్యత్తులో దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. తాము సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దేవాలయానికి గత కొన్నేళ్లుగా వస్తున్నామని, ఆ తల్లి చల్లని దీవెనలతో తామంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని పలువురు మహిళలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, కమిటీ సభ్యులు నిమ్మ జ్యోతి విష్ణువర్ధన్ రెడ్డి, ఎరుకల నాగేశ్వర్ గౌడ్, తలసాని శ్రీనివాస్ రెడ్డి, గంగాపురం నర్సింగ్ గౌడ్, మునగని నవీన్ కుమార్, సిబ్బంది రాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



