హైదరాబాద్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రజను ఆకట్టుకునేందుకు ఆరు హామీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తొలివిడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత.. ఎన్నికల సంగ్రామంలో ఆపార్టీ అగ్రనేతలే రంగంలోకి దిగారు. తొలివిడత ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ములుగు సహా మొత్తం 8 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ మొత్తం మూడు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, రైతులు, మహిళలతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ యాత్ర అనంతరం కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నెలకొంది.ఈ క్రమంలో రాహుల్ రెండో విడత యాత్ర షెడ్యూల్ కూడా రెడీ అయింది. ఈనెల 28నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాహుల్, ప్రియాంకతోపాటు ఈసారి సిద్ధరామయ్య కూడా హాజరుకానున్నారు. 28, 29 తేదీల్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేస్తారు. 30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. నవంబర్ 1 నుంచి 5 వరకు రాహుల్‌గాంధీ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. రాహుల్ రెండో విడత బస్సు యాత్ర.. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్ర సాగేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రాహుల్ పర్యటించేలా ప్లాన్ చేశారు.ఇదిలాఉంటే.. కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. వామపక్షాలతో పొత్తు విషయంపై తుది దశ చర్చలు జరగుతున్నాయి. సీపీఐ, సీపీఎం సీట్లు ఫిక్స్ అయిన మరుక్షణమే కాంగ్రెస్ రెండో జాబితాను అధిష్టానం ప్రకటించనుంది. మిగతా సీట్లలో అభ్యర్థులందరినీ ఒకేసారి కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.