లక్నో, అక్టోబరు 26, (వాయిస్ టుడే): విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, నృపేంద్ర మిశ్రా, మరో ఇద్దరు ప్రధాని మోదీని కలిసి.. ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల అభ్యర్థన మేరకు, ప్రధాని మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.వెయ్యేళ్లు అయినా సరే.. చెక్కు చెదరని.. ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. భక్తుల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఈక్రమంలోనే.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని… అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది.2024 జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి అయోధ్యలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ఠపన మహోత్సవానికి రావాలంటూ స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇలా రాశారు- ‘జై శ్రీరామ్! ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆయన నన్ను ఆహ్వానించారు. ఇది రాములవారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అంటూ ట్వీట్ ప్రధాని మోదీ చేశారు.