కరీంనగర్, అక్టోబరు 26, (వాయిస్ టుడే): కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పై తారురోడ్డు డ్యామేజీ కావడంతో.. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు కేబుల్ బ్రిడ్జ్ నాణ్యతని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేబుల్ బ్రిడ్జ్ తీగల వంతెన పనులు నాణ్యతగా లేవు.. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యత లెకుండానే కాంట్రాక్టు పనులు చేస్తున్నారు..
కాంట్రాక్టులకి లాభాలు గడించడానికే పనులు అని ఆయన పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నిర్మించిన చెక్ డ్యాం లు వరదలకి కొట్టుకుపోయాయని చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ సొంత ప్రయోజనాలకే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారని ఆయన మండిపడ్డారు.మరోవైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. హడావుడిగా కేబుల్ బ్రిడ్జ్ పనులు చేసారు.. అందాల బ్రిడ్జ్ కలర్ సోకులు ఎగిరిపోయి.. పైనా పటారం లోన లోటారం లాగా కనబడుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ వారే కాంట్రాక్టర్లు కావున నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అందాల బ్రిడ్జ్ కాదు ఇది.. రేపు కూలిపోతే పరిస్థితి ఏంది? అని నారాయణ ప్రశ్నించారు. బ్రిడ్జ్ లు ఎలా కూలిపోతున్నాయో.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంపై జ్యూడిషల్ ఎంక్వైరీ చేయాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.