విజయవాడ, నవంబర్ 1, (వాయిస్ టుడే): ఈ సంవత్సరం 27 మందికి వైయస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నాం.. ఇందులో నలుగురికి అచీవ్మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేస్తున్నాం.. సామాన్యులుగా ఎదిగిన అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అవతరించి ఇవాళ్టికి 67 సంవత్సరాలు.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేస్తున్నాం అన్నారు.. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న వ్యక్తులు వీరు.. సామాన్యులుగానే ఉన్న అసామాన్యులు వీరు.. 27 మందికి అవార్డులు అందించనున్నాం.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సేవ, వైద్యం వంటి రంగాల్లో అవార్డులకు ఎంపికైన వారంతా మన జాతి సంపదగా అభివర్ణించారు.రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది.. వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అన్నారు. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైయస్సార్ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఎంతగానో ఎదిగినా సామాన్యులుగా ఎదిగిన అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి అన్నారు..

ఈ సంవత్సరం 27 మందికి వైయస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో నలుగురికి అచీవ్మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఉన్నాయన్నారు.. తెలుగు తనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైయస్సార్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నాం అని తెలిపారు.వైఎస్సార్ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా చూసినవే అన్నారు సీఎం జగన్.. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, హేతు వాదానికి సాటి మనుషులకు చేస్తున్న సేవలకు ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కిందన్నారు.. వారి జీవితాన్ని అర్పించిన వారు మన హెరిటేజ్‌ను తమ భుజాల మీద మోసిన వారు.. వీరంతా మన జాతి సంపదగా అభివర్ణించారు. ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్తన అవార్డుల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడు సంవత్సరాల్లో సామాజిక న్యాయం వర్ధిల్లిందన్నారు..

ఈ వార్డులు అందుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.గవర్నర్, సీఎం జగన్ చేతుల మీదుగా ఏడు రంగాలకు 27 మంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 23 మంది వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. నలుగురు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. వ్యవసాయంలో పంగి వినీత వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అదే రంగంలో అనంతపురానికి చెందిన వైవి మల్లారెడ్డి పురస్కారం అందుకున్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ రంగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంగస్థల నడుటు యడ్ల గోపాలరావుకు, తప్పెటగుళ్లు కళాకారుడు కోన సన్యాసి, తిరుపతికి చెందిన కంలకారీ ఆర్టిస్టు తలిసెట్టి మోహన్, బాపట్లకు చెందిన హరికథా కళాకారుడు కోట సచ్చిదానంద శాస్త్రికి అవార్డు వరించింది. ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి పురస్కారం దక్కింది.
పురస్కారాలు అందుకున్న ఇతరులు
ఎస్వి రామారావు(కృష్ణా జిల్లా)- చిత్రకారుడు
బాల సరస్వతి (నెల్లూరు జిల్లా) ప్లేబ్యాక్ సింగర్
శివాజీ(ప్రకాశం జిల్లా ) జర్నలిస్టు, ఆర్టిస్టు
చింగిచెర్ల కృష్ణారెడ్డి(అనంతపురం జిల్లా) జానపద కళలు
కలీసాహెబీ మహబూబ్, షేక్ మహబూబ్ సుబానీ( ప్రకాశం జిల్లా )నాదస్వరం
ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం(పశ్చిమ గోదావరి)- సాహిత్యం
ఖదీర్ బాబు(నెల్లూరు) – సాహిత్యం
మహెజబీన్(నెల్లూరు )- సాహిత్యం
నామిని సుబ్రహ్మణ్యం నాయుడు(చిత్తూరు)- సాహిత్యం
అట్టాడ అప్పలనాయుడు(శ్రీకాకుళం)- సాహిత్యం
పుల్లెల గోపీచంద్(గుంటూరు)- స్పోర్ట్స్
కరణం మల్లీశ్వరి(శ్రీకాకుళం)- స్పోర్ట్స్
ఇండ్ల రామ సుబ్బారెడ్డి (ఎన్టీఆర్ జిల్లా)- వైద్యం
ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి(వైయస్సార్ జిల్లా)- వైద్యం
గోవిందరాజు చక్రధర్(కృష్ణా)- జర్నలిజం
హెచ్ ఆర్కే (కర్నూలు)- జర్నలిజం
బెజవాడ విల్సన్(ఎన్టీఆర్)- సోషల్ సర్వీస్
శ్యాం మోహన్(అంబేద్కర్ కోనసీమ)- సోషల్ సర్వీస్
నిర్మల హృదయ్ భవన్(ఎన్టీఆర్)- సోషల్ సర్వీస్
జి. సమరం(ఎన్టీఆర్ )- సోషల్ సర్వీస్



