హైదరాబాద్, నవంబర్ 2, (వాయిస్ టుడే ): తెలంగాణలో పర్యటించారు. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాలో బిజీబిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.. ఇప్పుడు మళ్లీ ప్రచారంపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ పర్యటకు రానున్నారు.ఈనెల 7, 11 తేదీల్లో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈనెల 7న తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. అలాగే… 1వ తేదీన పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్యఅతిథిగా రాబోతున్నారు ప్రధాని. మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రధాని రాష్ట్రానికి రానుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనతో మరోసారి రాజకీయం హీటెక్కబోతుంది. గత నెలలో నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ సీఎం కేసీఆర్‌పై సంచనల ఆరోపణలు చేశారు. రహస్యం చెప్పేస్తున్నా అంటూ… సీఎం కేసీఆర్ గుట్టు బయటపెట్టారు. తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని.. సీఎం కేసీఆర్ తనను అడిగారని.. అయితే.. తాను ఒప్పుకోలేదని చెప్పారు. వారసులను ముఖ్యమంత్రులను చేయడానికి కేసీఆర్ ఏమైనా రాజా, చక్రవర్తా అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఎన్డీయేలో చేరేందుకు కూడా కేసీఆర్ ఓకే అన్నారని.. కానీ తానే ఒప్పుకోలేదన్నారు. ఆనాడు ప్రధాని మోడీ చేసిన ఆ ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే.. మోడీ పర్మిషన్ అవసరంలేదంటూ కౌంటర్ ఇచ్చారు.అప్పుడు.. తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసి వెళ్లిన ప్రధాని మోడీ… ఈసారి కూడా అదే పంథా కొనసాగిస్తారా..? బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారా..? లేక… తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి వెళ్లిపోతారా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైపోయింది. ఈసారి ప్రధాని మోడీ… ఏ సీక్రెట్ బయటపెడతారో అంటూ మాట్లాడుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు.. కేసీఆర్ కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజులు రెండు, మూడు సభల చొప్పున నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. ప్రస్తుతం ప్రధాని మోడీ కూడా మరోసారి తెలంగాణ పర్యటనకు రానుండటంతో.. మరోసారి ఆ విమర్శలు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. దీనికి కేసీఆర్ ఎలా స్పందిస్తారు..? తెలంగాణ పర్యటనలో మోడీ రియాక్షన్ ఏంటి..? అన్నది పొలికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.