లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు
* నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ విడుదల చేసిన నివేదిక దృష్ట్యా బ్యారేజీల భద్రత, మరమ్మత్తులను కేంద్ర జల సంఘం చేపట్టాలని విజ్ఞప్తి.
* ఇకనైనా ప్రాజెక్టు నిర్మాణ డి.పి.ఆర్ ను ప్రజల ముందు ఉంచాలి.
* భూనిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించక పోవడం అసమర్థ పాలనకు నిదర్శనం.
* రీడిజైన్ పేరిట లక్ష కోట్లకు పైగా పెంచిన కాళేశ్వరం నిర్మాణ వ్యయంపై, ప్రజాధనం దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్.
హైదరాబాద్ నవంబర్ 4: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, అక్రమాలు తేటతెల్లం అయ్యాయని దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ సి.బి.ఐ చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీకి బుంగ పడడం, సుందిల్ల పటిష్టత, గతంలో మిడ్ మానేరు కొట్టుకు పోవడం, మల్లన్న సాగర్ కు భూకంపాల ముప్పు వున్నది అన్న నిపుణుల సూచనలను దాచి పెట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన డి.పి.ఆర్ ఈ రోజు వరకు కూడా ప్రజల ముందు ఉంచక పోవడం నేర సమానమని ఆయన అన్నారు. భూములని, ఆస్తులను, నివాసాలను, జీవనాధారాన్ని సర్వం కోల్పోయిన భూనిర్వాసితులకు ఈ రోజు వరకు కూడా చెల్లించాల్సిన పరిహారం చెల్లించక పోవడం తెరాస ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని తుమ్మనపల్లి దుయ్యపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు జరిగిన అవినీతి, అక్రమాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విడుదల చేసిన నివేదిక దృష్ట్యా మూడు బ్యారేజీల భద్రత, మరమ్మత్తులను కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కేవలం 18 వేల కోట్ల రూపాయలని చెప్పిన సంస్థను కాదని అప్పటి ప్రభుత్వం 40 వేల కోట్లకు ఖరారు చేయగా తెరాస ప్రభుత్వం రీడిజైన్ పేరిట 88 వేల కోట్లకు పెంచి తద్వారా ఒక అదనపు టి.ఎం.సి.ని తరలించడానికి సమాంతరంగా మరో కాలువను 22 వేల కోట్లతో ఎలాంటి సమగ్ర ప్రాజెక్టు డి.పి.ఆర్ ప్రజల ముందు పెట్టకుండానే లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం అసమర్థ పాలనకు, ప్రజాధనం దుర్వినియోగానికి నిదర్శనం అని దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.