మీ ఓటు తలరాత మారుస్తుంది.. ఐదేండ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది
చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
మందమర్రి నవంబర్ 7: మీ ఓటు తలరాత మారుస్తుంది.. ఐదేండ్ల భవిష్యత్‌ను కూడా నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి ఆషామాషీగా, అలవోకగా, డబ్బులు ఇచ్చారని ఓటు వేయొద్దు.. ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.చెన్నూరు చైతన్యం ఉండే ఏరియా.. ఉద్యమాలు జరిగిన నేల. అందరూ ఆలోచించాలి. అభివృద్ధి చెంది బాగా దూసుకుపోతున్న దేశాలకు, మన దేశానికి చాలా తేడా ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి దేశంలో రాలేదు. అలా వస్తే ఇలా ఎన్నికల్లో గడబిడ ఉండదు. ఎన్నికలు రాగానే ఆరోపణలు, డబ్బు సంచులు చూస్తున్నాం. చాలా దేశాలు ఏవైతే పరిణితి సాధించాయో, ప్రజలు విచక్షణతో ఓటేశారో.. ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.ప్రజాస్వామ్య దేశంలో ఉండే వజ్రాయుధం ఓటు. ఆ ఓటును ఆషామాషీగా, అలవోకగా, డబ్బులు ఇచ్చారని వేయొద్దు. విచక్షణతో ఆలోచించి ఓటేయాలి. మనం బాగా ఆలోచించి, పది మందితో చర్చించి నిజమేందో, అబద్ధమేందో నిర్ణయించాలి. తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరో ఒకరుర గెలుస్తరు. కానీ మీ కథ అక్కడికి అయిపోదు. మీ ఓటు ఐదేండ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఒకాయన వచ్చిండు. అర్జెంట్‌గా కండువా మార్చిండు. అట్లనే బీజేపీకి ఒకరు ఉంటారు. అభ్యర్థుల గురించి ఆలోచించాలి.
ప్రజలకు కోసం ఎంత పాటుపడుతాడని విచారించాలి. దాని కంటే ముఖ్యమైంది.. అభ్యర్థి వెనుకున్న పార్టీ గురించి ఆలోచించాలి. నడవడిక, ఆలోచనా సరళి, అధికారం ఇస్తే ఏం పనులు చేస్తున్నారనేది విచారించాలి. ఎమ్మెల్యే గెలుపుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తది. ఏ ప్రభుత్వం ఉంటే బాధ్యతతో పని చేస్తది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తమాషా కోసం ఓట్లు వేస్తే మన బతుకు కూడా ఆషామాషీ అయితది అని కేసీఆర్ అన్నారు.ఈ దేశంలో ఒక పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్ల ముందు ఉంది. నూరేండ్ల కింద బీఆర్ఎస్ పుట్టలేదు. రాష్ట్రం సాధించేందుకు పుట్టింది. బీఆర్ఎస్‌కు బాస్ ఢిల్లీలో ఉండరు. మాకు బాసులు తెలంగాణ ప్రజలే. మాకు వేరే బాస్‌లు ఉండరు. తెలంగాణ ప్రజలే ఏం కోరుతారు, ఆకాంక్షలు ఏంటో బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసు. ఢిల్లీ బాస్ ఉంటే.. కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ చూస్తున్నారు. తోలుబొమ్మ మాదిరి ఉంటుంది. పద్నాలుగు ఏండ్లు పోరాటం చేసి, చావు దగ్గరకు పోయి జైళ్లకు వెళ్లి, అవమానాలకు గురై తెలంతగాణ కోసం కొట్లాడినం. అధికారం ఇస్తే పదేండ్ల నుంచి ఏం చేశామో ఆలోచించండి. గత కాంగ్రెస్ ఏం చేసింది.. బీఆర్ఎస్ ఏం చేసిందో బేరిజు వేసుకోవాలి అని కేసీఆర్ సూచించారు.