అదిలాబాద్, నవంబర్ 11, (వాయిస్ టుడే ): ఇటు బెల్లంపల్లిలో, అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యలను తరిమి కొట్టాలని, వారి దుర్మార్గాలకు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విజయ భేరి యాత్రలో భాగంగా బెల్లంపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, 2004లోనే ఉచిత విద్యుత్ అందించింది తమ పార్టీ అన్నారు. ధరణి లేకపోతే రైతుల భూములు పోతాయని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధరణి వెబ్ సైట్ రాకముందు రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో ఎలా పడ్డాయో చెప్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 30,500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు కు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు…రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. బెల్లంపల్లి సభకు హాజరైన ఈ జన ప్రవాహాన్ని చూస్తోంటే గోదావరి నది ఈ మైదానంలో ప్రవాహించినట్లుంది అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే పేరు కాకా వెంకటస్వామి. దేశంలో గాంధీ కుటుంబంలా తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులన్నారు. గడ్డం వినోద్, వివేక్ లను అత్యధిక మెజారిటీతో గెలిపంచాలని ఓటర్లను రేవంత్ కోరారు. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే ఈ ఇద్దర్నీ గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు.సీఎం కేసీఆర్ ఇసుక మీద ప్రాజెక్టులు కట్టిన ఘనుడు అంటూ తెలంగాణ సీఎంపై రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మెడిగడ్డకు తీసుకెళ్లిండు. ఇప్పుడు చూస్తే మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయిందని.. అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా? అదేమైన పేక మేడనా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ అణా పైసకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దుర్గం దుర్మార్గాల గురించి తెలంగాణతో పాటు దేశమంతా తెలుసునని, అలాంటి వ్యక్తిని గెలిపించాలని సీఎం కేసీఆర్ చెబుతుండు. అసలు చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? సింగరేణి ఉద్యోగాలు, భూముల్ని బీఆర్ఎస్ నేతలు అమ్ముకోలేదా? అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం’ అని రేవంత్ అన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటుండు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ కు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తుండు. అయితే ధరణి రాకముందు 2018లో కేసీఆర్ రైతు బంధు ఎలా ఇచ్చారు?. ధరణి కంటే మెరుగైన టెక్నాలజీని కాంగ్రెస్ అందుబాటులోకి తీసుకొస్తుంది. రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు, రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇచినట్లే… కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుంది. కాంగ్రెస్ గెలువుతోనే ఆదిలాబాద్, రాష్ట్రం సైతం అభివృద్ధి చెందుతుందని’ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.