వరంగల్, నవంబర్ 22, (వాయిస్ టుడే): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో తీరుగా ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నాయకులు పొరపాటున పాత పార్టీ పేరును, నేతలకు జై కొడుతూ నాలుక్కరుచుకుంటున్న ఘటనలు ఉన్నాయి. అయితే తెలంగాణలో ప్రత్యేకత ఉన్న వారిలో కొండా సురేఖ దంపతులు ఉంటారు. ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడానికి బదులుగా.. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకే వెళ్లి కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని కొండా సురేఖ కోరారు.
కొండా సురేఖ వైఎస్సార్ హయాంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమ మంత్రిగా సేవలు అందించారు. తాజాగా వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వెయ్యండి అంటూ ఆమె ఓట్లు అడిగారు. ఈ విషయం వరంగల్ వ్యాప్తంగా వైరల్ గా మారింది. డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ కనుక అధికార పార్టీ ఆఫీసుకు వెళ్లి మరీ ఓట్లు అడిగినా.. నవ్వుతూనే బటయకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ర్యాగింగ్ లెవల్ 100 శాతం అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ తమ ట్విట్టర్ (ఎక్స్)లో వీడియో పోస్ట్ చేసింది. ఇక అది మొదలు కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కు అడిగిన ఓట్ల వీడియో వైరల్ అవుతోంది. ఇంకా నయం వరంగల్ ఈస్ట్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఓటు అడగలేదు కదా అంటూ నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.కొండా సురేఖ 1995లో మండల పరిషత్ కు ఎన్నికైనారు. 1996లో ఆమె ఏపీ పి.సి.సి సభ్యురాలిగా నియమితులయ్యారు. 1999 లో శాయంపేట శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1999 లో ఆమె కాంగ్రెస్ లెసిస్లేచర్ పార్టీ కోశాధికారిగానూ, మహిళ, శిశు సంక్షేమశాఖ సభ్యురాలిగానూ, ఆరోగ్య, ప్రాథమిక విద్య కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. 2000లో ఏఐసీసీ సభ్యురాలయ్యారు. 2004లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు.. 2005లో ఆమె మ్యునిసిపల్ కార్పొరేషన్ కు ఎక్స్ అఫీసియో సభ్యురాలిగా ఉన్నారు. 2009లో పరకాల శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణం, ఆపై ఆయన కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వనందున కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. జూలై 4 2011 న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అనంతరం వైసీపీలో చేరి ఉప ఎన్నికలలో పరకాల నుంచి పోటీ చేశారు. వైసీపీకి రాజీనామా చేసి 2013లో టీఆర్ఎస్ లో చేరిన కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మళ్ళీ కాంగ్రెస్ గూటికి వచ్చారు. త్వరలో జరగనన్న ఎన్నికల్లో తూర్పు వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చింది. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ అంకితభావం అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ఎక్స్ ఖాతాలో వీడియో షేర్ చేసింది.