విశాఖపట్నం: గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మారిస్తే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ, విశాఖ నుంచి పాలన సాగించేందుకు వీలుగా కార్యాలయాలను తరలిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తదితర పొలిటికల్ టూరిస్టులు ఎందుకు భయపడుతున్నారని, ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు ఎందుకు రాయిస్తున్నారని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో ఆయన అన్ని రోజులు ఉండటం అదే ప్రధమమని అన్నారు. 2014- 19 సమయంలో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాదులోనే ఎక్కువ కాలం గడిపారని అటువంటి వ్యక్తికి ఆంధ్ర ప్రజలపై అభిమానం, రాష్ట్ర అభివృద్ధిపై మమకారం ఎలా ఉంటుందని అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. కేవలం పొలిటికల్ టూరిస్ట్ గా ఆంధ్ర ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోతున్న చంద్రబాబు తదితరులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టే అర్హత లేదని ఆయన అన్నారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ఆ ప్రాంత ప్రజలను నమ్మించి మోసం చేసి, ఇప్పుడు అక్కడి నుంచే పాలన సాగించాలని కోరుకుంటున్నారు తప్ప, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి చంద్రబాబు ఆలోచన చేయటం లేదని అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తే అమరావతిలో తనవి, తనవారి భూములు ధరలు ఎక్కడ తగ్గిపోతాయోనన్న భయంతో మీడియాలో విషపు రాతలు రాయిస్తున్నారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు.



