హైదరాబాద్, నవంబర్ 27, (వాయిస్ టుడే ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో.. మీ అమ్మగారైన శ్రీమతి సోనియాగాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉండి కూడా.. దాదాపు 1200మంది ఆత్మహత్య చేసుకున్నాక గానీ.. తెలంగాణ ఇవ్వలేదు. ఇది కాకుండా.. నాడు విద్యార్థి లోకం, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తుంటే.. వారికి మద్దతు తెలపాల్సింది పోయి, రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం, మజ్లిస్ పార్టీలతో మీరు జతకట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకిశోరాలను అత్యంత కిరాతకంగా తుపాకులతో కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్ కాదా? కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తర్వాత 2009లోనూ తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న ప్రకటన చేసి, ఆ తర్వాత 23వ తేదీన దీన్ని వెనక్కు తీసుకున్న సమయంలో ఇక్కడ రగిలిన మనసుల గురించి, ఆగిన గుండెల గురించి మీరు ఏనాడైనా ఆలోచించారా అని అన్నారు. అసలు డిసెంబర్ 23 నాటి మీ నిర్ణయంలో ఏదైనా శాస్త్రీయత కనిపించిందా..? లేక మజ్లిస్, సీపీఎం వంటి రాజకీయ మిత్రుల ఒత్తిడికి తలొగ్గారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ విషయంలో మొదట్నుంచీ బీజేపీ ఓ స్పష్టమైన ఆలోచనతో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కాకినాడలో చేసిన ఒక ఓటు, రెండు రాష్ట్రాల తీర్మానం మొదలుకుని.. పార్లమెంటులో స్వర్గీయ సుష్మాస్వరాజ్ పలుమార్లు పార్లమెంటులో గొంతెత్తడంతో.. తెలంగాణ విషయంలో మీ మొద్దునిద్ర వదిలిందని దుయ్యబట్టారు. నాడు లోక్‌సభ వేదికగా సుష్మాస్వరాజ్ చేసిన చారిత్రక ప్రసంగం ఇంకా ప్రజల కళ్లముందు కదలాడుతోందని తెలిపారు. తెలంగాణకు అండగా ఉండాలన్న సుష్మాస్వరాజ్ నిర్ణయం, పార్లమెంటు లోపల, బయట బీజేపీ చేసిన ఉద్యమం, తెలంగాణలో వందలాది మంది విద్యార్థుల బలిదానానికి తలొగ్గి మీరు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు’ను ప్రవేశపెట్టారన్నారు. ఇది వాస్తవం కాదని చెప్పే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోని మీరు, మీ పార్టీ.. తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ కుటుంబాన్ని మీ ఇంటిని ఇంటికి పిలిపించుకొని ఆశీర్వచనాలిచ్చి, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వెనక జరిగిన వాస్తవ కథనాలకు వాస్తవరూపం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెరముందు రాజకీయంగా వైరుధ్యాన్ని పాటిస్తూనే.. తెరవెనుక కలిసిపనిచేయాలనే మీ దోస్తీ బట్టబయలైందని తెలిపారు.అందుకే 2014, 2018ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినా.. మీరు ప్రజాప్రాతినిధ్య చట్టం ఆధారంగా ‘గీత దాటిన’వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. మీ ప్రతి నిర్ణయం వంచనేనని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్న మోసం బట్టబయలైంది. తెలంగాణ ఎన్నికల్లో మీ అపవిత్ర దోస్తీని పసిగట్టిన జనం.. ఇరుపార్టీలకు సరైన బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో, పార్లమెంటులో బిల్లుకు సహకరించుకోవడంలో మీ స్నేహాన్ని యావత్ తెలంగాణ సమాజం చూసిందని.. అవన్నీ గుర్తుంచుకుంది కూడా అని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విభజన సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడిలా అలాగే ఉన్నాయి. దీనికి కారణం.. మీ స్వార్థ బుద్ధి, రాజకీయ కుట్ర అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కర్ణాటకలో మీ పార్టీ గెలిచేందుకే కేసీఆర్ డబ్బు పంపించాడంటూ అనేకరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో మీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నాడని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను, సొంతరాష్ట్రంలో బతుకులు బాగుపడతాయనుకున్న ప్రజల ఆశలను కాలరాస్తూ.. మీ రెండు కుటుంబ, అవినీతి పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు తెలగాణ ప్రజలు మీ ఇద్దరికీ సరైన బుద్ధి చెబుతారు.