తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు మళ్లీ బండి సంజయ్ కి అప్పగించనున్నారా..? ఇప్పుడీ అంశం బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి స్థానంలో అధ్యక్ష బాధ్యతలను బండి సంజయ్ కి అప్పగించనున్నారని సమాచారం. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల వరకే తాను అధ్యక్షుడిగా ఉంటానని కిషన్ రెడ్డి చెప్పారు. అందుకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పింది.
త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో మళ్లీ బండి సంజయ్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు వచ్చినప్పటికీ.. బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. కేవలం 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి.
అధ్యక్ష పదవి రేసులో మరో పేరు…
అటు మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేరు కూడా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో వినిపిస్తోంది. ఆయనను అధ్యక్షుడిని చేసే అవకాశం లేకపోలేదు అని సమాచారం. ఇద్దరూ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలే. బీసీ సీఎం అనే నినాదం కూడా బీజేపీ తీసుకుంది. కాబట్టి బండి సంజయ్ లేదా లక్ష్మణ్ ఈ ఇద్దరిలో ఒకరికి మళ్లీ అధ్యక్ష పదవి అవకాశం దక్కబోతోందని తెలుస్తోంది.



