Monday, January 26, 2026

ముందే మేల్కొన్న జగన్

- Advertisement -

50 మందికి కొత్త వారికి ఛాన్స్

విజయవాడ, డిసెంబర్ 12: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది.  ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కనీసం 50 స్థానాల్లో మార్పు ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,  గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. వచ్చే వారం 10 రోజుల్లో మరో నలభై నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పులు ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణలో BRS చీఫ్ కేసీఆర్  సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చారు. అదే అభ్యర్థులను మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఇప్పటి వరకూ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఉపేక్షించారు కానీ.. ఇక ఉపేక్షించకూడదని మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందేననని నిర్ణయించుకున్నారు…వైసీపీ అధిష్టానం. అనుకున్నదే తడవులుగా  ఐ ప్యాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంచార్జుల మార్పుపై దృష్టి సారించారు. ఈ సారి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే బలమైన నేతలు ఉంటే.. వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి 11 నియోజకవర్గాల్లో ఇంచార్జుల్ని మార్చారు. సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు వస్తున్న చోట్ల సీనియర్ నేతలు, గతంలో పోటీ చేసిన వారి కన్నా కొత్త వారికి అవకాశం కల్పించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇంచార్జుల్ని మార్చిన 11 నియోజకవర్గాల్లో పలువురు కొత్త ఇంచార్జులు ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి బాలసాని కిరణ్‌ కుమార్, చిలుకలూరిపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు, అద్దంకి నుంచి పాణెం హనిమిరెడ్డి, రేపల్లె నుంచి ఈపూరి  గణేష్, గాజువాక నుంచి  వరికూటి రామచంద్రరావుకు అవకాశం కల్పించారు. వీరు గతంలో పోటీ చేయలేదు. వీరికి క్లీన్ ఇమేజ్ ఉంటుందని.. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి వీరు బ్యాలెన్స్ చేస్తారని భావిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలకు సొంత నియోజకవర్గాల్లో పరిస్థితి బాగోలేకపోతే ఇతర నియోజకవర్గాల్లో అయినా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంత్రి మేరుగ నాగార్జునకు వేమూరు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని తేలడంతో ఆయనను సంతనూతల పాడు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీజేఆర్ సుధాకర్  బాబు ఉన్నారు. ఆయనకు నియోజకవర్గ నేతలతో…విభేదాలు ఉన్నాయి. దాంతో ఈసారి పక్కన పక్కన పెట్టేశారు. యర్రగొండపాలెంలో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను.. కొండేపికి మార్చారు. కొండేపిలో వైసీపీ తరపున పని చేసుకుంటున్నప్పటికీ.. తీవ్ర వర్గ పోరాటంలో ఉండే వరికూటి అశోక్ బాబును వేమూరుకు మార్చారు. ఈ నియోజకవర్గాలకు వీరంతా కొత్తే. అందుకే వ్యతిరేకత బ్యాలెన్స్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తాడికొండకు ఇంచార్జ్ గా నియమించారు. నిజానికి సుచరిత సొంత నియోజకవర్గం తాడికొండే.. ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించారు. మంత్రి విడదల రజనీ ఈసారి చిలుకలూరిపేట నుంచి పోటీ చేయరని తేలిపోయింది. మల్లెల రాజేష్ నాయుడు అనే నేతను ఇంచార్జ్ గా నియమించారు. రజనీకి గుంటూరు పశ్చిమను కేటాయించారు. గుంటూరు పశ్చిమ టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పేరు ఉంది. అక్కడ వైసీపీ టిక్కెట్ కోసం అరడజన్ మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన మద్దాలి గిరికి ఈ సారి హ్యాండ్ ఇచ్చారు. ఫిరాయింపు సమయంలో టిక్కెట్ ఇస్తామని హామీ ఉన్నప్పటికీ ఆయనకు ఛాన్సివ్వడం లేదు. ఇలాగే లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఏసురత్నం వంటి నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ వారందర్నీ కాకుండా విడదల రజనీకి కేటాయించారు.ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుతో  పాటు 11 స్థానాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించినట్లయింది. అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య ఇంచార్జ్ గా ఉన్నారు. హఠాత్తుగా ఆయనను తప్పించి హనిమిరెడ్డిని నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు టిక్కెట్ లేనట్లే. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కనీసం 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి ఉందని.. నియోజవర్గాలు మార్చనున్నారని చెబుతున్నారు. అదే జరిగితే…వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్