నాంపల్లి మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే చార్మినార్, ట్యాంక్‌బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయన్నారు. నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు. ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ఇక్కడ ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని, పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థల యజమానులు కలిసి నుమాయిష్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ నుమాయిష్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యాసంస్థల్లో 30వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేసిందని కొనియాడారు. ఇక రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌ను ఎంచుకున్నారని, రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.



