అర్హులందరికీ గ్యారెంటీ పథకాలు అమలు
– దశల వారీగా ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపు
-యాసంగి పంటకు సాగునీటి కొరత లేకుండా పకడ్బందీ చర్యలు
– ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి
అర్హులందరికీ ప్రభుత్వ గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. గ్రామసభలలో ముందస్తుగా ప్రజా పాలన కార్యక్రమం ఉద్దేశించి వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట అమలు చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు పథకాలను అమలు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అభయ హస్తం మిగిలిన గ్యారెంటీ పథకాల అమలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వెనక్కి తగ్గకుండా అర్హులందరికీ గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని అన్నారు. అభయ హస్తం గ్యారెంటీ పథకాల అమలులో ఎట్టి పరిస్థితిలో అవినీతికి ఆస్కారం ఉండదని, ప్రభుత్వ పథకాలను అర్హులకు దశలవారీగా పారదర్శకంగా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా పాలన కార్యక్రమం క్రింద మిగిలిన గ్యారెంటీ పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ప్రజలంతా తమ దరఖాస్తులు నమోదు చేయాలని, జనవరి 6 వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు.
గ్రామంలో ఉన్న అర్హులైన ప్రతి కుటుంబంచే ప్రజా పాలన కార్యక్రమం క్రింద గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే విధంగా పంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో రేషన్ కార్డులు లేని వారు ప్రజా పాలన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు సమర్పించాలని, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని అన్నారు. మహాలక్ష్మి , రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల అమలు కోసం అర్హులను పూర్తి పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుందని, ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను కంప్యూటర్లో నమోదు చేయడం జరుగుతుందని, అనంతరం అర్హులను ఎంపిక చేసి, ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. యాసంగి పంటకు సాగునీటి కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే దిశగా కృషి చేస్తామని అనవసరమైన అపోహలు నమ్మవద్దని ఎమ్మెల్యే అన్నారు. రైతు బంధు పథకం నిలిచిపోతుందని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజల కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం తీసివేయదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగ్గా రైతు భరోసా పేరుతో త్వరలో రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, జడ్పిటిసి స్వరూప ప్రకాష్ రావు, ఎంపీటీసీ నిర్మల, ఎంపీఓ ఫయాజ్ అలీ, గ్రామ సర్పంచ్ అంజలి అనంతరెడ్డి, ఉప సర్పంచ్ రాజు, ప్రజా ప్రతినిధులు, తహసిల్దార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.