దీర్ఘకాలం సమ్మె కొనసాగటానికి ప్రభుత్వానిదే బాధ్యత.
జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా
9వ రోజు సమ్మెలో పంగనామాలతో వినూత్న నిరసన.
బద్వేలు
మున్సిపల్ ఉద్యోగ- కార్మికులకు ముఖ్య మంత్రివర్యులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 9వ రోజులో భాగంగా బద్వేలు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి దినం మంత్రుల బృందంతో జరిగిన చర్చలు విఫలమైనందున జగనన్న కార్మికులకు ఇచ్చిన హామీలు గోవిందా గోవిందా అంటూ పంగనామాలతో బుధవారం వినూత్న నిరసన చేపట్టడం జరిగింది.*
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ…. మున్సిపల్ కార్మికుల సమ్మె, ఆందోళనలు దీర్ఘ కాలం కొనసాగటానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది,ముఖ్యమంత్రిదే బాధ్యతఅని,న్యాయసమ్మతమైన సమస్యలను అంగీకరించి సమ్మెకు ముగింపు పలకాలని కార్మికులు, ప్రజలు కోరుకుంటున్నా, ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని,
భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ,దుబారా ఖర్చులు చేస్తున్న ప్రభుత్వం కష్టించి పనిచేసే కార్మికుల వేతనాలు పెంపుకు నిధులు లేవని బుకాయించడం తగదని,
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపుదల ప్రభుత్వ బాధ్యతని, పాలకుల దయా, దాక్షిణ్యం కాదని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వాలు బుట్ట దాఖలు చేస్తున్నాయని,
కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయకుండా మొండికేస్తున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు మున్సిపాలిటీ తదితర కార్మికులకు రద్దు చేయడం శోచనీయని,
కార్మికులకు ఎన్నికల ముందు, తర్వాత మాట ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు మాట తప్పి హామీలను తుంగలో తొక్కారని,మున్సిపాలిటీలో జనాభా పెరుగుతున్నా, పౌర సేవలు పెరుగుతున్నా, కార్మికుల సంఖ్య పెంచకుండా ఇటు కార్మికులను, అటు పౌరులను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తున్నదని,
పన్నులు, భారాల పెంపుపై ఆదేశాలిస్తున్న కేంద్రం, మోడీ కార్మికుల వేతనాలు పెంపు విషయంలో మౌనం వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కు అవుతున్నదని,
ప్రభుత్వం ఒకవైపు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతూ, మరోవైపు నిర్బంధానికి పాల్పడుతు, అరెస్టులకు పూనుకుంటు, పోటీ కార్మికులతో రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని,
కార్మిక ఆందోళనలతో పరిస్థితి మరింత జటిలమవుతున్నదని,
ఇప్పటికైనా ముఖ్యమంత్రి మౌనం వీడి, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని కార్మిక డిమాండ్లను అంగీకరించి సమ్మె పరిష్కరించాలని లేనిపక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మె, ఆందోళనలకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు పలకాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్షుడు పులి శ్యాం ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, కోశాధికారి కాలువ శివకుమార్, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్ ప్రవీణ్ కుమార్, నేలటూరు పాలయ్య, కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య,తేళ్ల కిరణ్, ఇండ్ల చంద్రశేఖర్, పాతర పెంచల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


