ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి..
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ
తిరుపతి,
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన వైద్య సదుపాయాలు, వైద్య సిబ్బంది నియామకంతో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వైద్య అధికారులు, ఎఎన్ఎం తదితర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిల్లకూరు మండలం చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిహెచ్సిలోని పేషంట్ల నమోదు రిజిస్టర్ ను పరిశీలించారు.
ఈ – ఔషధీ ఫార్మసీ స్టాక్ రిజిష్టర్ ను పరిశీలించి అందులోని స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. అలాగే ల్యాబ్ ను, పురుష, స్త్రీ వార్డులను, శస్త్ర చికిత్స గదిని, వ్యాక్సిన్ నిల్వను, ఓ.పి లను పరిశీలించి అక్కడ చికిత్స కొరకు వచ్చిన పలువురిని అడిగి పిహెచ్సి లో మందులు ఇస్తున్నారా లేదా అని, చికిత్స సక్రమంగా అందిస్తున్నారా అని ఆరాతీయగా పీహెచ్సి లో అన్ని సదుపాయలు బాగున్నాయని, ట్రీట్మెంట్ బాగుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు సూచిస్తూ పేషంట్లకు మందులు పిహెచ్సి నుండి తప్పనిసరిగా ఇవ్వాలి అని, పాము కాటుకు సంబందించిన యాంటీ వీనం, యాంటీ రేబిస్ తదితర అత్యవసర వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ప్రజలకు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సదుపాయాలపై, గర్భధారణ మధ్య ఎడమ, పోషకాహారం తదితర అంశాలపై కౌన్సెలింగ్ ఏర్పాటుతో అవగాహన కల్పించి ప్రజల్లో విస్తృతంగా తెలిసేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మీడియా తో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే పరమావధి లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో సిబ్బంది, వైద్య సేవలు అందించడం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేట్ హాస్పిటల్ ల కన్నా మిన్నగా సేవలు ఉన్నాయని ప్రజలు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. చింతవరం పీహెచ్సి లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వైద్య పరీక్షలకు ఆధునిక పరికరాలు, మందులు, వ్యాక్సిన్ లు ఏర్పాటు ఉన్నాయనీ, రక్త పరీక్షల పరికరాలు ఎలక్ట్రోలైట్ ఎనలైజర్, సెంట్రీఫ్యూజ్, సెమి ఆటో బయో కెమికల్ అనలైజర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాడు-నేడులో పలు ఆసుపత్రులు మంచిగా రూపు దిద్దుకున్నాయని తెలిపారు.
కలెక్టర్ వైద్యాధికారులతో బిపి పరీక్ష చేయించుకున్నారు. ఎంపీటీసీ మాధవి గ్రామంలో సీసి రోడ్లు, హాస్పిటల్ కాంపౌండ్ కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, డిపిఎంఓ శ్రీనివాస రావు, జిల్లా సర్వైవ లెన్స్ అధికారిణి తేజేశ్వరి, పీహెచ్సి వైద్యులు పాల్ జాన్సన్, సుమ తదితరులు పాల్గొన్నారు.



