పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి సంఘటనలు తావివ్వకుండా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
జగిత్యాల
మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు జరుగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి సంఘటనలు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.సోమవారం రోజున ప్రజావాణి అనంతరం పదవ తరగతి వార్షిక పరీక్షలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి భరోసా కల్పించాలని అన్నారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు జరిగే వార్షిక పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాలలో 11,365 మంది విద్యార్థులు పరీక్షా హాజరు కానున్నారని, 435 పాఠశాలలోని 5602 బాలురు, 5763 బాలికలు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు, 67 డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 6 గురు అదనపు డిపార్ట్ మెంటల్ అధికారులు, 4 గురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 22 మంది వాహన ఇంచార్జ్ లు, కస్టోడియన్లు, 702 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని తెలిపారు. 67 కేంద్రాలలో 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని అన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటుకు 4 గురు డిప్యూటి తహశీల్దార్లను డిప్యూట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యుత్ సరఫలో అంతరాయం కలుగాకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులకు సమయానికి ముందే బస్సుల సమయాలను రీ షెడ్యుల్ చేయాలని ఆర్టీసి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జవాబు పాత్రలను పార్శిల్ చేయడానికి పోస్టల్ అధికారులు సహకరించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులు పరీక్షల సందర్భంలో ఎలాంటి భయాందోళనలు, ఒత్తిడులకు లోనవకుండా పాఠశాల యాజమాన్యాలు, అధికారులు వారి పర్యటన సందర్భంలో వివరించాలని తెలిపారు. మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారి పర్యటన సందర్భంలో పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాలని మనోధైర్యాన్ని కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్ మోహన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.