విడుదలైన వ్యూహం
హైదరాబాద్, మార్చి 2
సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ అనేక అడ్డంకులు దాటుకుని మార్చి 2న ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీసిన చిత్రమని ప్రతి ఒక్కరికీ తెలుసు. సినిమా ప్రదర్శనకు ముందు రామ్ గోపాల్ వర్మ గొంతు వినబడుతోంది. ఓ డిక్లరేషన్ కనబడుతుంది. సినిమా ఎవరినీ ఉద్దేశించినది కాదని, నిజ జీవితంలో వ్యక్తులను పోలిన పాత్రలు కనిపిస్తే కేవలం యాదృశ్చికం మాత్రమేనని తెలిపారు. సినిమాలో పేర్లు కూడా మార్చారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంటున్న ప్రేక్షకులు ఎవరి పేరును ఎలా మార్చారో తెలుసుకోండి. మాజీ ముఖ్యమంత్రి, జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి పేరు ‘వ్యూహం’లో వీరశేఖర రెడ్డి అయ్యింది. జగన్ పార్టీ పేరు వైయస్సార్ సీపీ. తండ్రి పేరు వచ్చేలా పెట్టారు. ‘వ్యూహం’లో రాజశేఖర రెడ్డి పేరు వీరశేఖర్ రెడ్డి కనుక వీయస్సార్ సీపీ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి పేరునూ మార్చారు. జగన్ బదులు మదన్ అని పేర్కొన్నారు. భారతి పేరును మాలతిగా మార్చారు వర్మ. ‘వ్యూహం’లోని పాటల్లో, సినిమాలో చూపించిన జెండాల్లో జగన్, అని ఉండటం గమనార్హం. జగన్, భారతి పాత్రల్లో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ నటించారు. విజయమ్మ (సినిమాలో పేరు విఎస్ జయమ్మ) పాత్రలో సురభి ప్రభావతి నటించారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీలో కీలక సభ్యుడు, ఏపీ మంత్రి అంబటి రాంబాబు పేరును గంపటి శ్యాంబాబుగా మార్చారు. ఆ పాత్రలో వాసు ఇంటూరి నటించారు. అయితే… ఆయన్ను సినిమాలో పేరు పెట్టి పిలిచింది లేదు.’వ్యూహం’లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరులు నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రలు ఉన్నాయి. అయితే… చిరంజీవిని కిరంజీవి, నాగబాబును స్నేక్ బాబు చేశారు. వాళ్ల తమ్ముడి పేరు శ్రవణ్ కళ్యాణ్. అంటే పవన్ అని ప్రత్యేకంగా చెప్పాలా? ప్రజారాజ్యం పేరును మన రాజ్యం, జనసేనను మనసేన అని మార్చారు.వ్యూహం’లో చిరంజీవిగా ధర్మతేజ్, నాగబాబుగా సుధాకర్, పవన్ కళ్యాణ్ పాత్రలో చింటూ నటించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పేరును కల్లు అరవింద్ చేయగా… ఆ పాత్రలో పొట్టి మూర్తి నటించారు. పవన్ కళ్యాణ్ రెండు లక్షల బుక్స్ చదివానని చెప్పిన మాటలపై మూవీలో సెటైరికల్ డైలాగ్స్ పడ్డాయి.తెలుగు దేశం పార్టీని వెలుగు దేశంగా, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును తారా ఇంద్రబాబు నాయుడుగా చూపించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలో లోకేష్ ప్రస్తావన ఉంది. కానీ, నేరుగా ఆ పాత్రను చూపించలేదు. ఇంద్రబాబు తనయుడు ఎప్పుడూ తింటూ ఉంటారన్నట్టు చూపించారు. ‘వ్యూహం’ సినిమాలో ఇంద్రబాబు పాత్ర చేసిన వ్యక్తి పేరు ధనుంజయ్ ప్రభునే.కాంగ్రెస్ పార్టీని భారత్ పార్టీ చేసిన రామ్ గోపాల్ వర్మ… రోశయ్య పేరును కాశయ్య అని, పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు కోసం అక్కడ డాక్యుమెంటరీ తీసిన దర్శకుడు రాయపాటి అని ‘వ్యూహం’లో పేర్కొన్నారు. ఈ విధంగా మెజారిటీ రాజకీయ నాయకుల పేర్లకు బదులు ఇంచు మించు దగ్గరగా ఉండే వేర్వేరు పేర్లు వాడారు. బహుశా… సినిమా విడుదలను అడ్డుకుంటూ వచ్చిన కేసులు, ఇతర సమస్యల నుంచి బయట పడటం కోసం ఈ విధంగా పేర్లు మార్చినట్టు ఉన్నారు.
విడుదలైన వ్యూహం
- Advertisement -
- Advertisement -