ఇంటి నుంచి కవితకు భోజనం
న్యూఢిల్లీ, మార్చి 27
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వరకూ ఆమెకు రిమాండ్ విధించగా.. అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఈ కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను ఉదయం న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. మళ్లీ తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరగా అందుకు నిరాకరించిన న్యాయస్థానం కవితకు రిమాండ్ విధించింది. ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి ఇచ్చామని.. మరోసారి ఇవ్వలేమని పేర్కొంటూ రిమాండ్ విధించింది.కవితకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. అలాగే, మంచం, పరుపు, బట్టలు, చెప్పులు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు సైతం అంగీకరించింది. పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈ వెసులుబాట్లు ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్ కు తగు ఆదేశాలు జారీ చేసిందిమరోవైపు, కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. తన పిల్లలకు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టును కోరారు. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ అధికారులు కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు న్యాయస్థానానికి వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.కవితను మళ్లీ తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ‘కవిత సమాజంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీని వల్ల దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. పథకం ప్రకారమే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. కవితను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలి.’ అని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే, ఇప్పటికే రెండుసార్లు కవితను కస్టడీకి ఇచ్చామని.. మరోసారి కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కవితకు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. మంగళవారం ఉదయం కోర్టుకు హాజరు పరిచిన క్రమంలో కవిత మీడియాతో మాట్లాడారు. ‘నాపై తప్పుడు కేసు పెట్టారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తా. తాత్కాలికంగా నన్ను జైలులో పెట్టొచ్చు. కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీలో చేరాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీలో చేరారు. మూడో వ్యక్తి రూ.50 కోట్లు బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చారు.’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, కోర్టుకు వెళ్తున్న సమయంలో జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ ఆమె నినాదాలు చేశారు.
ఇంటి నుంచి కవితకు భోజనం
- Advertisement -
- Advertisement -