ఇక మండే కాలమే…
హైదరాబాద్, మార్చి 29
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం.
ఇక మండే కాలమే…
- Advertisement -
- Advertisement -