లోకసభ తర్వాత స్థానిక సమరం
జూన్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు
హైదరాబాద్, ఏప్రిల్ 26
లోక్‌సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈమేరకు బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యాగ్‌లను మే 15లోగా ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఎస్‌ఈసీ ఆదేశించింది.తెలంగాణలో సర్పంచుల పదవీకాలం గత ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు పదవీకాలం జూలై 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్‌ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు స్పీడప్ చేసింది.ఇక, పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను కూడా రాష్ట్ర ఎన్నిల సంఘం ఇప్పటికే సేకరించింది. తాజాగా బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మొదటి నుంచి పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతోనే నిర్వహిస్తోంది. ఈసారి కూడా అదే రీతిలో జరిపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ బ్యాలెట్ బాక్సులకు కాగితపు సీళ్లు, చిరునామా ట్యాగ్‌లు అంటించాల్సి ఉంది. దీనికోసం వాటి ముద్రణ చేపట్టాలని నిర్ణయించింది. పేపర్ సీళ్లతోపాటు పోలింగ్ కేంద్రం, గ్రామం, మండలం, జిల్లాలను సూచించే ట్యాగ్‌లను ఆంగ్ల, తెలుగు భాషల్లో ముద్రించాలని నిర్ణయించింది. వీటిని హైదరాబాద్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు సూచించింది.లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ జూన్ నాలుగో తేదీతో ముగుస్తుంది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వీలుంది. తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలో ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే జూన్‌లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రెండు మూడు నెలల వ్యవధిలో అభిప్రాయ సేకరణ చేసి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దీనిని ప్రభుత్వం ఆమోదించి రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది
లోకసభ తర్వాత స్థానిక సమరం
- Advertisement -
- Advertisement -