దూకుడు… ప్లస్సా… మైనస్సా…
హైదరాబాద్, జూన్ 27,
దూకుడు కొన్నిసార్లు సక్సెస్ ఫార్ములా అవుతుంది. మరికొన్ని సార్లు పెద్ద దెబ్బే తగిలేలా చేస్తోంది. రాజకీయ రంగంలో కూడా అంతే. దూకుడు రాజకీయాలు కొన్నిసార్లు ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ చేస్తాయి. కొన్ని సార్లు ఆ దూకుడు నిర్ణయాలే ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారతాయి. ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయాలకు వస్తే.. సీఎం రేవంత్ రెడ్డి అంటే ఓ దూకుడు స్వభావం ఉన్న రాజకీయ నేత. ఆ స్వభావమే రేవంత్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించింది.ప్రతిపక్షంలో ఏ పార్టీ అయినా, లేదా పొలిటికల్ లీడర్ అయినా దూకుడుగా ప్రభుత్వం మీదకి వెళ్లడం వల్లే ప్రజల్లో ఓ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. కాని అధికారం పక్షంలో ఉన్న వారికి మాత్రం చట్టం, నిబంధనలు, ప్రజల మూడ్ వంటివి ఆ దూకుడుకు ప్రతిబంధకాలు. ఆచి తూచి నిర్లయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అధికారంలో ఉన్న వారిది. అయితే ప్రతిపక్షంలో చేసినట్లే ఇప్పుడు పాలనాపరంగాను, రాజకీయంగాను చేస్తే మాత్రం ఎదురు దెబ్బలు తప్పవు. ప్రతిపక్షంలో ఉన్న దూకుడు స్వభావమే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దెబ్బ తీస్తోందా అంటే అవుననే చెప్పాలి. అందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒకటి పాలన పరమైనది, అయితే రెండోది పార్టీ రాజకీయానికి సంబంధించినది. పాలనా పరమైన విషయానికి వస్తే.. రాష్ట్ర చిహ్నంలో మార్పు. కేసీఆర్ హయాంలో రూపొందించిన రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేపట్టాలని రేవంత్ రెడ్డి తీసుకున్న దూకుడు నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటివి తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. ఇవి రాజకరికపు ఆనవాళ్లు అన్న వ్యాఖ్యలు అధికార పక్షం నుండి వినపడ్డాయి. కాని కాకతీయుల వైభవం, చార్మినార్ సింబల్ అనేది తెలంగాణ చరిత్రతో ముడిపడిన అంశం. వీటిని తొలగిస్తారన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు చక్కగా వాడుకున్నారు. ప్రజల్లో కూడా కొంత భావోద్వేగం బయపడింది. దీంతో సర్దుకున్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపై శాసన సభలో అన్ని పార్టీలతో చర్చించి ఓ నిర్ణయానకి వస్తానని చెప్పి రాష్ట్ర చిహ్నం మార్పును పక్కన పెట్టారు. అంటే ప్రజలను తన ఆలోచన ప్రకారం సిద్దం చేయకుండా భావోద్వేగమైన అంశాల్లో ఒకే సారి మార్పులు చేపడితే వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కొంత ఆలస్యంగా గ్రహించారు. దూకుడుగా నిర్ణయం తీసుకోవాలనుకున్నా… ఇది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విషయమని పాక్షికంగా మార్పు నిర్ణయాన్ని పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు రాజకీయంగా చూస్తే… జీవన్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయానికి మరో ఉదాహరణ. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ తీవ్ర దుస్థితిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు పెద్ద పెద్ద నేతలే కారెక్కేసారు. కాని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాత్రం కేసీఆర్ ఆహ్వానించినా పార్టీలో చేరనని, సున్నితంగా తిరస్కరించారు. ఆ సమయంలో జీవన్ రెడ్డి సీనియర్ లీడర్ గా తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలోను సీనియర్. అధిష్టానానికి విధేయుడు. సౌమ్యుడు. అంతే కాదు ఎలాంటి మరకలు లేని వ్యక్తిత్వం. అలాంటి లీడర్ కు తెలియకుండా.. తనపై పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను రేవంత్ గుట్టు చప్పుడు కాకుండ పార్టీలోకి తీసుకురావడం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చాంశనీయంగా మారింది.సాధారణంగా పార్టీలో ఎవరైనా కొత్తగా చేరాలంటే ఏ జిల్లా నేత అయితే చేరతారో…. ఆ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తారు. ఆ చేరే నాయకుడి వల్ల రాజకీయంగా జిల్లాలో చూపే ప్రభావాన్ని అంచనా వేస్తారు. స్వంత పార్టీ నేతల ఇబ్బందులపైన చర్చించాకే… కొత్త లీడర్ ను చేర్చుకుంటారు. లేదంటే జిల్లాలో ముఖ్యమైన సీనియర్ లీడర్ తో అయినా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఏకపక్షంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలోకి తీసుకోవడం ఓ దూకుడు నిర్ణయంగానే చెప్పాలి. ఈ నిర్ణయంతో కినుక వహించిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తనకు తెలియకుండా సంజయ్ కుమార్ ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని అసమ్మతి గళం విప్పారు. దీంతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆయనతో చర్చించి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటం వల్ల జీవన్ రెడ్డి రాజీనామా చేసే విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నారు.. పార్టీ లైన్ ఇది కాదని సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి కొంత ధిక్కార స్వరం వినిపించడం జరిగింది.ఈ వ్యవహారం టీ కప్పులో తుపానుగా ఉంటుందా.. లేక రాజకీయ తుపానుగా రానున్న రోజుల్లో దారి తీస్తుందా వేచి చూడాలి. ఎందుకంటే.. ఎన్నికల ముందు కాంగ్రెస్ లోచాలా మంది సీఎం సీటు ఆశించిన వారే. ఈ తరహా దూకుడు అలాంటి కొంత మంది అసంతృప్త నేతలకు అస్త్రంగా మారే ప్రమాదం లేకపోలేదు. సీఎం సీటుకు తనతో పాటు పోటీ పడిన నేతలతో పోల్చితే.. రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించారనడంలో సందేహం లేదు. ఆ కారణంగానే సీనియర్లు కాదని, మంత్రి పదవి చేపట్టని రేవంత్ రెడ్డిని ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు అదే దూకుడు తనకు మేలు చేస్తుందా.. లేదా రాజకీయంగా కీడు చేస్తుందా అన్నది మాత్రం రానున్న రోజుల్లో అర్థం అవుతుంది. జాతీయ పార్టీల కోణం నుండి చూస్తే… స్టీరింగ్ మన చేతిలో ఉన్నా… అధిష్టానం డైరెక్షన్ లోనే బండి నడపాల్సి ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డికి తెలియనిదేమి కాదు. కాని ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాతే దాని ఫలితాలే… మన పని తీరుకు గీటు రాయిగా నిలుస్తాయి. తీసుకున్న నిర్ణయం దూకుడుతనంతో తీసుకున్నాదా… లేదా ఆలోచించి తీసుకున్నాదా అని. చూద్దాం రానున్న రోజుల్లో ఈ దూకుడు మరిన్ని విజయాలను రేవంత్ రెడ్డికి అందిస్తుందా… లేక బ్రేక్ వేస్తుందా అన్నది తేలాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.
దూకుడు… ప్లస్సా… మైనస్సా…
- Advertisement -
- Advertisement -