ఏడాది ముందే… రెడ్ సిగ్నల్
లైట్ తీసుకున్న జగన్
తిరుపతి, జూన్ 29,
2024 శాసనసభ ఎన్నికల్లో తాము ఎలా తీర్పు చెప్పబోతున్నామో జనం ఒక ఏడాది ముందే చెప్పారు. కానీ వైసీపీ అధినేత జగన్ కు మాత్రం అర్థం కాలేదు. అర్థం అయినా పట్టించుకోలేదనుకోవాలి. జనం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మేం ఇచ్చే తీర్పు ఇదే అని కుండబద్దలు కొట్టారు. అయినా అలివిమాలిన మొండితనం అహం దానిని జీర్ణం చేసుకోవడానికి జగన్ కు అడ్డం వచ్చినట్లుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లు తీరా శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత బాధపడి ఏం లాభం? మూడు పట్బభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చినప్పుడే జగన్ మేలుకుని ఉంటే ఇంత దారుణమైన ఓటమిని మాత్రం ఖచ్చితంగా జగన్ చవి చూసేవారు కాదు. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్ల ఓటమికి గల కారణాలను లోతుగా పరిశీలించి ఉంటే ఇంతటి పరిస్థితి పార్టికి పట్టేది కాదు. అవును.. ఎవరు మర్చిపోయినా.. జగన్ గుర్తుకు తెచ్చుకోవాలి. శాసనసభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మూడు ప్రాంతాలు అంటే దాదాపు రాష్ట్రమంతటా ఆ ఎన్నికల ఫలితాలు ప్రజానాడిని ప్రతిబింబిస్తాయి. ఒకరకంగా జగన్ కు ఆ ఎన్నిక మంచి చేయాల్సి ఉంది. ఎందుకంటే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అధికార వైసీీపీ ఓటమి పాలయింది. అప్పటి వరకూ ఓటమి అన్న మాట ఎరుగని జగన్ అండ్ కో దానిని తేలిగ్గా తీసిపారేశారు. పేరుకు పట్టభద్రుల స్థానాలయినప్పటికీ దాదాపు వందకు పైగా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికలవి. ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు జనసేనతో పొత్తు లేదు. బీజేపీతో టీడీపీకి సఖ్యత లేదు. అయినా జనం టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ఇది బలమైన సంకేతం కాదా? ఇక్కడ ఓటమి ఎందుకొచ్చిందని ఒక్క రోజు దానిపై కేటాయించి పోస్టుమార్టం చేస్తే ఇంతటి దుర్గతి పట్టి ఉండేది కాదు గదా,అప్పటి వరకూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీదే వన్ సైడ్ విక్టరీ. అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో తాడిపత్రి మినహాయించి ఫ్యాన్ పార్టీ అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రజలు, ప్రభుత్వోద్యోగుల నాడి తెలుస్తుంది. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందో సానుకూలత ఉందో తెలుసుకునే వీలుంది. పశ్చిమ రాయలసీమ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ తరుపున భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పోటీ చేసి గెలిచారు. తూర్పు రాయలసీమకు సంబంధించి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరుగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు. అయితే అప్పుడు వైసీపీ నేతలు ఈ ఎన్నికలు తమకు కొత్త అని, ఎలక్షనీరింగ్ ను తమ నేతలు చేయలేకపోయారని కుంటిసాకులు చెప్పి జగన్ ను తప్పుదోవపట్టించారు. అది నమ్మితాడేపల్లిలో కూర్చున్న జగన్ ఆ ఫలితాలను తేలిగ్గా తీసుకున్నారు.ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓమిని చూసైనా అక్కడ రాజధాని కంటే జనం మరొకటి ఆలోచిస్తున్నారని భావించి ఉంటే ఇంత భారీ డ్యామేజీ జరిగి ఉండేది కాదు. కానీ ఆ పనిచేయలేదు. రాయలసీమలో పట్టున్న వైసీపీకి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవిచూసినప్పుడయినా ఎక్కడో తేడా కొడుతుందన్న సందేహం వచ్చి ఉండాలి. కానీ సీమ తనను మోసం చేయదనుకున్నారు. నెల్లూరు, ప్రకాశంలో తనకు తిరుగులేదనుకున్నారు. అతి విశ్వాసంతో ఆ ఓటమిని అస్సలు పట్టించుకోలేదు. ఆ ఓటమిపై కనీసం విశ్లేషణ చేసేంత తీరిక కూడా జగన్ కు లేదు. పోనీ ఏమైనా పర్యటనలతో బిజీగా ఉన్నారా? అంటే అదీ లేదు. మూడు ప్రాంతాల నేతలను పిలిచి ఒక్కసారి మాట్లాడి వారితో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని ఉంటే నాడే తన పరిస్థితి తనకు తెలిసి వచ్చేది. కానీ జగన్ ను అలాంటి పోస్టుమార్టం చేయకుండా కొందరు కోటరీ నేతలు అడ్డుపడటంతో శాసనసభ ఎన్నికలకు వచ్చే సరికి అసలుకే ఎసరు వచ్చింది. ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని నాడే ఆ ఎన్నికల్లో వ్యక్తమయింది. నిరుద్యోగ సమస్య పెరిగి పోవడం, పరిశ్రమలు రాకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వంటి కారణాలతో గ్రాడ్యుయేట్లు తమకు అండగా నిలుస్తారని భావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. పథకాల ప్రయోజనం పొందుతున్న కుటుంబాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఓటర్ల జాబితాలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడ్డంతిరిగి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అప్పుడు ఆఎన్నికలు బ్యాలట్ పేపర్లపైనే జరిగాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్. ఆయనకు అనుకూలమైన పోలీసులు, అధికారులున్నారు. కానీ సొంత జిల్లా కడప ప్రాంతంలోనూ టీడీపీ నాడు గెలిచిందంటే నాడే టీడీపీ విజయం ఖాయమయిందని జగన్ గుర్తించాల్సి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఆరోజే టీడీపీ విజయం ఖాయమయింది. జగన్ ఆ ఓటమిని ఈజీగా తీసుకున్నారు. అదే అసలు ఎన్నికలకు వచ్చేసరికి మరింత ఎక్కువయింది. ఆరోజు ఏమాత్రం మేలుకుని కొంతలో కొంతయినా మారి ఉన్నా, నిర్ణయాలను లోతుగా విశ్లేషించుకున్నట్లయితే నేడు ఇంతటి ఘోరమైన ఓటమి మాత్రం వచ్చేది కాదు. అభ్యర్థులను మారిస్తే చాలని జగన్ అనుకున్నారు కానీ అసలు కారణం తానేనని మాత్రం గుర్తించలేకపోవడమే అనర్థానికి కారణం
ఏడాది ముందే… రెడ్ సిగ్నల్
- Advertisement -
- Advertisement -