డీఫాల్ట్ బెయిల్ పైనే ఆశలు
Hopes on default bail :
హైదరాబాద్, జూలై 10,
భారత రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ఐదు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేయడానికే ప్రెస్ మీట్ పెట్టామని కేటీఆర్ చెప్పారు. నిజానికి వారు ఢిల్లీలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ విషయం చెప్పడానికి ఐదు రోజులు సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరో ప్రత్యేకమైన కారణంతోనే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ కారణం కవితకు బెయిల్ అనే గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కల్వకుంట్ల కవితను మార్చి పదిహేనో తేదీన ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో సీబీఐ కూడా అరెస్టు చూపించింది. అంటే ఇప్పుడు ఆమె అటు సీబీఐ కేసులో.. ఇటు ఈడీ కేసుల్లోనూ అరెస్టు అయ్యారు. ఇప్పుడు బెయిల్ రావాలంటే రెండు కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది. దిగువ కోర్టులో అనుకూల ఫలితం రాలేదు. ఎగువ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా చార్జిషీటు విషయంలో న్యాయపరమైన అవకాశం దొరకడంతో వెంటనే.. డీఫాల్ట్ బెయిల్ కోసం దిగువకోర్టును ఆశ్రయించారు. చార్జిషీటులో లోపాలున్నందున పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపున బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.కవిత జైలుకు వెళ్లి దాదాపుగా నాలుగు నెలలు అవుతోంది. ఇంత కాలం జైల్లో ఉంచడం అన్యాయమని న్యాయనిపుణులతో కోర్టుల్లో వాదించేందుకు కేటీఆర్, హరీష్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. పేరెన్నికగన్న న్యాయనిపుపుణలతో చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిణామాల్ని కనుక్కుంటూ.. కొత్తగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఆదేశాలిస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో ప్రముఖ లాయర్లతో కేసీఆర్ కూడా మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. కవితను ఎలాగైనా బెయిల్ పై బయటకు తీసుకురావాలని ఆ తర్వాతనే హైదరాబాద్ వెళ్లాలన్న ఆలోచనలో కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని చెబుతన్నారు. శుక్రవారం వరకూ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఆ రోజున బెయిల్ వస్తే మిగతా లాంఛనాలు పూర్తి చేసి అందరూ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బెయిల్ వచ్చే సంకేతాలు ఉన్నందున హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అయితే కేజ్రీవాల్ కు దిగువ కోర్టు బెయిల్ ఇచ్చిన హైకోర్టులో చుక్కెదురు అయింది. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఏడాదికిపైగా జైల్లోనే ఉన్నారు. మరి వారెవరికీ రాని బెయిల్ కవితకు వస్తుందా అన్న సందేహాలు కూడా కొంత మందిలో వ్యక్తమవుతున్నాయి