టీబీజేపీ కొత్త బాస్ ఎవరు
Who is the new boss of TBJP?
హైదరాబాద్, జూలై 12,
ఈ నెలఖరుకే కొత్త సారథికి పగ్గాలు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. అందరికంటే ముందు రేసులో ఈటల రాజేందర్ ఉన్నా.. ఆయనకు రఘునందన్, ధర్మపురి అర్వింద్ నుంచి గట్టి పోటీయే ఉంది. ఈ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని ప్రచారం జరుగుతున్న టైమ్‌లో.. ఎవరికివారు తమ బలాబలాలను హైకమాండ్ ముందు ఉంచుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ తన ఉనికిని క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఎన్నికలు ఏవైనా కమల వికాసం ఖాయం అనేలా తన కేడర్ ను బలపరుచుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఒక బలమైన దిశానిర్దేశం చేసే నాయకుడు ఉండాలని భావిస్తోంది. అయితే కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతుండడంతో.. పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పుపై హైకమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.హర్యానా ఎన్నికల నేపథ్యంలో ముందుగా అక్కడ బీజేపీ చీఫ్‌ను ప్రకటించారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్‌లాల్ బడోలీకి బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లోనూ అధ్యక్ష మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కిషన్‌రెడ్డి కేంద్ర కేబినెట్‌లో ఉన్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా అధ్యక్ష బాధ్యతల్ని మరొకరికి అప్పగించేలా కసరత్తు జరుగుతోంది. గతంలో బండి సంజయ్ కు ఇచ్చిన తరుణంలో తిరిగి ఆయనకే ఆధ్యక్షుడి పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ ఓ వర్గంలో జరుగుతోంది. అయితే ఆయనకు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పదవి దక్కే అవకాశాలు కనపించడం లేదు. దీనికి కారణం ఆయనను కూడా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి వరించడమే. దీంతో ఇక మిగిలింది ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్. ఈ ముగ్గురిలో ఈటలకు అవకాశాలు అధికంగా ఉండటానికి కారణం రాష్ట్రంలో సీనియర్ నేత, బీఆర్ఎస్ లో ఉండి అక్కడి పరిస్థితులు కేసీఆర్ వ్యూహాలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయనకే రాష్ట్ర అధ్యక్షుడి పదవి దక్కుతుందని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా మరో 20 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త రథసారధి ఎవరనే ఉత్కంఠకు తెర తొలగనుంది.