పంచాయితీ ఎన్నికల పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
CM Revanth’s key decision on panchayat elections
హైదరాబాద్ న్యూస్ డెస్క్ జూలై 16 ; స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
గత పంచాయతీ ఎన్నికల అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు సీఎం రేవంత్‌కు వివరించారు. ఇప్పటికే కుల గణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని సీఎం అధికారులను ప్రశ్నించారు. కర్ణాటకలో 2015 లో, బిహార్‌లో 2023లో కుల గణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కుల గణన చేసిన వివరాలు ఇంకా బయటపెట్టలేదని అధికారులు వివరించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర మాజీ మంత్రి కె.జానారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.



