దేశం గర్వించేలా వినూత్న పరిశోధనలు చేపట్టాలి

- Advertisement -

దేశం గర్వించేలా వినూత్న పరిశోధనలు చేపట్టాలి
ఘనంగా ఏపీ నిట్ 6వ స్నాతకోత్సవం

Innovative research should be undertaken to make the country proud

తాడేపల్లిగూడెం.,
దేశం గర్వించేలా వినూత్న  పరిశోధనలు, ఆవిష్కరణలు చేపట్టాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్సు చైర్మన్, ఐఐటి అల్యూమిని కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి శర్మ విద్యార్థులకు సూచించారు.  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్) 6వ స్నాతకోత్సవాన్ని (2020-24 బ్యాచ్ విద్యార్థులకు) ప్రాంగణంలోని రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు.  ముఖ్య అతిధి రవి శర్మ మాట్లాడుతూ డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు సంపాదించిన జ్ఞానం, నైపుణ్యాలు వారు జీవితంలో ముందడుగు వేయడానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువుల పాత్ర ఎంతో అమూల్యమైనదని వారిని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలన్నారు. నైతికత జ్ఞానం, స్నేహం, శాశ్వతమైన జ్ఞాపకాలకు పునాది ఈ విద్యాలయం అన్నారు. ఈ రోజు విద్యార్థుల ఉత్సాహాన్ని, ఆనందాన్ని చూస్తుంటే నా గ్రాడ్యుయేషన్ డే గుర్తుకు వస్తుందన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు ఆవిష్కృతం అవుతున్నాయని వాటిలో మెలకువలు నేర్చుకుని పట్టు సాధించిన వారు అగ్రస్థానాల్లో నిలదొక్కుకుంటారన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే అన్ని అంశాలపై అవగాహనను కలిగి ఉండాలని సూచించారు. జీవితం 100 మీటర్ల పరుగు పందెం కాదని,  అది మారథాన్ అని అందుకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధపడాలన్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఆయువు పట్టు యువతరమేనని, దేశ గతిని, స్థితిని మార్చే సత్తా నవతరానికి ఉందన్నారు. నిత్య అన్వేషిగా రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడంపై విద్యార్థులు దృష్టి పెట్టాలన్నారు. జీవితంలో చిత్తశుద్ధి అనేది అత్యంత ముఖ్యమైనదన్నారు. చదువులో రాణించాలనే తపన ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందడుగు వేస్తే విజయ శిఖరాలను సులువుగా చేరుకోవచ్చని సూచించారు. యువత తమలోని అపార శక్తి యుక్తులను వెలికి తీసి కాలానికి తగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని చెప్పారు. ప్రతి విమర్శను సమర్థవంతంగా, సానుకూలంగా ఎదుర్కోని, వాటిని భవిష్యత్తుకు మెట్టుగా మలుసుకోవాలని తెలిపారు. సరైన లక్ష్యాలు ఎంచుకుని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు.
జీవితాన్ని నిర్మించడంలో అత్యంత కీలకమైన అంశాలలో ఆరోగ్యం ఒకటని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు కనీసం 30 నిమిషాల సమయాన్ని వ్యాయామం, యోగ, ధ్యానం వంటి వాటికి కేటాయించాలని చెప్పారు. విద్యార్థులు చదువు, సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికంగానూ ఎదగాలన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తమవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. విద్యార్థులు విభిన్న ఆలోచనలు చేస్తూ నూతన ప్రాజెక్టులు చేపడితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని వివరించారు. ఏపీ నిట్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేసినప్పుడే విద్యార్థులైనా దేశాలైనా పురోగతిలో పయనిస్తాయని తెలిపారు. ప్రయోగశాల, పరిశోధన పరికరాల సేకరణ, మౌలిక సదుపాయాల నిమిత్తం కేంద్రం రూ 754 కోట్లు మంజూరు చేయనుందని చెప్పారు. ఇవి కాకుండా గతేడాది రూ 5 కోట్లతో 18 ప్రయోగశాలను ప్రారంభించామని తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి బీటెక్ విద్యార్థులకు కొత్త  పాఠ్యాంశాలను అందుబాటులో తీసుకురానున్నామని చెప్పారు ఆచార్యులకు సంబంధించి అంతర్జాతీయ జర్నల్స్ లో 181 పరిశోధన వ్యాసాలు ప్రచురితమవగా, వివిధ సమావేశాలలో 121 పత్రాలను సమర్పించారని తెలిపారు.  నాలుగు ప్రయోజిత పరిశోధన ప్రాజెక్టుల నిమిత్తం వివిధ ఏజెన్సీల నుంచి రూ 4.25 కోట్లు వచ్చాయన్నారు.  ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఇంధన శాఖ ద్వారా ఏపీ నిట్ రాష్ట్ర ఇంధన సంరక్షణ అవార్డును (రజితం) ఇంజనీరింగ్ కళాశాల విభాగంలో అందుకుందన్నారు. ఫెలోషిప్ మెంటరింగ్ ప్రోగ్రాం 2024 కోసం భారతదేశంలోని 25 మంది ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ సభ్యులలో ఒకరిగా సీఎస్ఈ డిపార్ట్మెంట్  ఆచార్యుడు ఉండతంతోపాటు ఎంఎంఈ విభాగానికి చెందిన ఆచార్యులు తుప్పు అవేర్నెస్ అవార్డున అందుకోవటం తమకు ఎంతో గర్వకారణమన్నారు. కంపెనీలు, పరిశ్రమల అవసరాలు తగినట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తమ విద్యార్థులు చదువుతోపాటు పలు క్రీడల్లో
రాణించి పతకాలను అందుకోవడం, గేట్ పరీక్షల్లోమంచి ర్యాంకులతో సత్తాచాటడం అభినందనీయమని కొనియాడారు. ప్రస్తుతం ప్రాంగణ ఎంపికల విషయంలో గడ్డుకాలం నడుస్తున్న తమ విద్యార్థులు 70 శాతం ప్లేస్ మెంట్ సాధించడం శుభపరిణామమని వివరించారు.ముందుగా 2020 -24 విద్యా సంవంత్సరంలో బీటెక్ నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసుకున్న 527 మంది విద్యార్థులకు, రెండేళ్ల ఎంటెక్ కోర్సును పూర్తి చేసిన15 మంది విద్యార్థులకు డిగ్రీలు, 25 మంది పరిశోధనా విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశారు.కోర్సులవారీగా అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన బయో టెక్నాలజీకి చెందిన రామిరెడ్డి వెంకట సాయిరెడ్డి 9.62 గ్రేడ్ పాయింట్లు, కెమికల్ ఇంజనీరింగ్ కి చెందిన మంకాల కార్తీక్ 9.44, సివిల్ ఇంజనీరింగ్ కి చెందిన గుబ్బల హారిక 9.12,  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి చెందిన సలాడీ వెంకట శశి భూషణ్ 9.83, ఈఈఈకి చెందిన టంకాల దీప్తి సాయి 9.09 , ఈసీఈకి చెందిన రెడ్డి వీర వెంకట సాయి కృష్ణ అనిల్ 9.27, మెకానికల్ ఇంజనీరింగ్ చెందిన మంత్రిప్రగడ సాయి అఖిల్ 9.56, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్  ఇంజనీరింగ్ కి చెందిన గంటా మోహిత్ సలాడి యాదవ్ 8.83 తోపాటు  2020-24 బ్యాచ్ లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన సలాడి వెంకట   శశిభూషణ్ ఇనిస్టిట్యూట్ తరఫున బంగారు పతకాలను అందజేశారు. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంగణంలోని వివిధ భవనాలకు ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి, డీన్ లు డాక్టర్ జి ఆర్కే శాస్త్రి, డాక్టర్ టి.కురుమయ్య, డాక్టర్ వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్.జయరామ్, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, అసోసియేట్ డీన్ డాక్టర్ వి.సందీప్, సెనేట్ సభ్యులు, విభాగాధిపతులు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular