- Advertisement -
ఉద్యోగులను ప్రసన్నం చేసుకోనే పనిలో జగన్
Jagan in the task of pleasing the employees
గుంటూరు, నవంబర్ 23, (వాయిస్ టుడే)
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సడన్‌గా ఉద్యోగులపై సానుభూతి చూపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు మధ్యంతర భృతి, పెండింగ్ డిఏలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడారు. తమ హయాంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27% IR ఇచ్చామని టిడిపి మాత్రం పవర్‌లోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంతవరకూ ఉద్యోగులను పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన IR, రెండు పెండింగ్ DAలను వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇంత అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు బాసటగా నిలవడం ఉద్యోగ సంఘాల్లోనే సంఘాల్లోనే చర్చను లేపింది నిజానికి అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి తీవ్రంగా గురైంది. ఏ స్థాయిలో అంటే జగన్ ఓటమికి తమ ఉద్యోగులే కారణమంటూ ఆయా సంఘాల నేతలు బహిరంగంగా ప్రకటించేంత. దానికి కారణం అప్పట్లో జగన్ ప్రభుత్వంలోని కీలక నేతలు వ్యవహరించిన తీరే. 2019ఎన్నికలకు ముందు చంద్రబాబు 20% మధ్యంతర భృతిని ఉద్యోగుల కోసం ప్రకటించారు. దానిని తాము అధికారంలోకి వస్తే 27శాతం చేస్తానన్న జగన్ ఆ మాట నెరవేర్చుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతనే ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య గ్యాప్ మొదలైంది. పిఆర్సి కంటే ముందుగా ఇచ్చే కొంత వెసులుబాటును IR అంటారు. తరువాత దానికి కొంత కలిపి PRC ఇస్తారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఆర్ధికంగా వర్కౌట్ కాదంటూ IR కంటే PRCని తక్కువగా ఇచ్చింది. దీనిని రివర్స్ పిఆర్సిగా పేర్కొంటూ ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కాయి. అంతకుముందు పెండింగ్‌లో ఉన్న డీఏలను పిఆర్సిలో కలిపేస్తూ సర్దుబాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇది ఉద్యోగ సంఘాలను షాక్‌కి గురి చేసింది. ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్న టైంలో ఏ ప్రభుత్వమైనా సంఘాలతో మెతకగా వ్యవహరిస్తూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తినేలాగా వ్యాఖ్యలు చేశారని సంఘాల నాయకులు విమర్శించారు. తర్వాత చర్చల సమయంలో ప్రభుత్వం ప్రతిపాదనకు ఓకే చెప్పినా ఎన్నికల సమయానికి మాత్రం వారు పూర్తిగా రివర్స్ అయ్యారు. 2004లో చంద్రబాబు సంస్కరణల పేరు చెప్పి ఉద్యోగులకు ఎంత దూరమయ్యారో అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారంలోకి రాగానే సిపిఎస్‌ను రద్దు చేస్తామంటూ చేసిన హామీని కూడా తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన వైనం కూడా ఉద్యోగుల వ్యతిరేకతకు ఒక కారణమైంది. దానితో 2024 ఎన్నికల్లో ఉద్యోగుల సైడ్ నుంచి జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది.జరిగిన నష్టాన్ని గుర్తించిన జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో తామ అధికారంలోకి వచ్చాక IR ఇస్తామంటూ టిడిపి హామీ ఇచ్చింది. అలాగే ప్రస్తుతానికి రెండు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే వాటిని క్లియర్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి అనడం ఉద్యోగులు కూడా ఊహించని పరిణామం. ఉద్యోగుల తరఫున అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇది ఉద్యోగులకు లాభం చేకూర్చే పనే అయినా తమ హయాంలో ఉద్యోగులను దూరం పెట్టిన జగన్ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం ఉద్యోగ సంఘాలను సైతం అయోమయంలో పడేసింది. మరి జగన్ చేసిన డిమాండ్‌పై ఉద్యోగసంఘాల నాయకులు, ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో చూడాలి.
- Advertisement -