- Advertisement -
తిరుపతిలో స్థానికుల శ్రీవారి దర్శనానికి టోకెన్లు జారీ
Tokens are issued for Srivari darshan of locals in Tirupati
ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు
తిరుపతి,
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావుతో కలిసి స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, స్థానికులకు మళ్లీ శ్రీవారి దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు.
వారి ఆదేశాల మేరకు నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు.
అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ, స్థానికుల కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలో 2,500, తిరుమలలో 500 టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డుతో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల నివాసితులకు టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి నెలా మొదటి ఆదివారం తిరుపతి, తిరుమలలోని రెండు కేంద్రాల్లోనూ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలియజేశారు. నిర్ణీత సమయంలోగా విస్తృత ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ అధికారులను ఈవో అభినందించారు. ఇదిలా ఉంటే స్థానిక భక్తులు ఒకసారి శ్రీవారిని దర్శనం చేసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే తదుపరి దర్శనానికి అర్హులు. భక్తులు సులువుగా టోకెన్లు పొందేందుకు వీలుగా క్యూలైన్లు, టోకెన్ల జారీకి అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఎ.శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యుడు డా.ఎం.శాంతారాం, టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో . లోకనాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -


