- Advertisement -
కులగణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు
Ration cards based on caste census survey
కరీంనగర్, జనవరి 20, (వాయిస్ టుడే)
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కులగణన సర్వే ఆధారంగా జారీ చేయనున్నారు. అయితే కులగణనలో ఖచ్చితత్వం ఎంత? అన్న దానిపైనే ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇళ్లకు వచ్చి యజమానులు చెప్పిన వివరాల ఆధారంగానే నమోదు చేసుకుని సర్వే సిబ్బంది వెళ్లారు. అయితే ఇది ఖచ్చితమైన సమాచారం అనేది మాత్రం క్లారిటీ లేదు. కొందరు పొలాలు, ఆస్తులను దాచి ఉంచారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ప్రభుత్వ పథకాలు తమకు అందవన్న భయంతోనే ప్రజలు తమ ఆస్తుల విషయాన్ని బయటపెట్టలేదని కూడా వార్తలు వచ్చాయి. అదే సమయంలో సిబ్బంది కూడా తూతూమంత్రంగా చేసిన ఈ సర్వే ప్రాతిపదికన రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఎలా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కులగణన లో అనేక ప్రశ్నలు వేశారు. యాభైకి పైగా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంలో సర్వే సిబ్బంది యాంత్రికంగానే వ్యవహరించారు. కనీసం వారి ఆదాయం గురించి కూడా ఆరా తీయలేదు. దీనివల్ల అనర్హులు ఎక్కువ మంది తెలుపు రంగు రేషన్ కార్డులు పొందే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రేషన్ కార్డుల జారీకి కులగణన సర్వే ప్రాతిపదిక కాకూడదు. దానికి నిబంధనలు వేరుగా ఉంటాయి. ఆదాయ పరిమితితో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించడానికి అనేక మార్గాలున్నాయి. ఇప్పుడు తెలంగాణ జరిగిన కులగణన వల్ల ఖచ్చితమైన సమాచారం వచ్చిందన్న నమ్మకం ఎవరికీ లేదు. మరి దాని ప్రాతిపదికన ఎలా రేషన్ కార్డులు మంజూరు చేస్తారన్న ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం లేదు.పాత రేషన్ కార్డులను కూడా తొలగించే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 26 నుంచి తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ జరగనుంది. రేషన్‌కార్డుల ఫైనల్ లిస్ట్ ను దాదాపు అధికారులు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కొత్తగా ఆరున్నర లక్షల రేషన్‌కార్డులు ప్రభుత్వం జారీ చేసే అవకాశముందని కూడా చెబుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను కూడా గ్రామసభలో నిర్ధారించి రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుందని చెబుతున్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కూడా ప్రకటన చేసింది. అయితే అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని, అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేసేలా కేవలం కులగణన సర్వేపై ఆధారపడవద్దన్న సూచనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
గ్రామ సభల్లో ఎంపిక
ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా అమలుచేస్తున్నామన్నారు. వ్యవసాయ భూములు ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి రూ.12,000, భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12,000 ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.గ్రామసభలలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో రూపొందించకుండా, గ్రామసభలలోనే ఖరారు చేస్తామన్నారు. ఎర్రుపాలెంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. చెరువులు, అడవులను రక్షిస్తూ ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు.కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎలాంటి జాబితాలు తయారు కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లబ్దిదారుల జాబితా గ్రామాల్లోనే తయారవుతుందని పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భట్టి విక్రమార్క ప్రారభించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రజలందరి సమక్షంలోనే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభలలో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు.తెలంగాణలో మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను తీసుకున్నప్పటికీ… వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవలే నిర్వహించిన కుటుంబ సర్వే ఆధారంగా… రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు సర్కార్ ప్రకటించింది. ఈ సర్వే ఆధారంగానే ప్రాథమిక జాబితాలను సిద్ధం చేసింది. వీటిని పౌరసరఫరాల శాఖ గ్రామాల వారీగా విభజించి విడుదల చేసింది.ప్రాథమిక జాబితాలు విడుదల కావటంతో గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ పేర్లు లేదని పలువురు వాపోతున్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని… అయినా తమ పేర్లు లేదని చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డు జాబితాలు రావటంతో ప్రజల్లో అనేక అపొహాలు నెలకొన్నాయి. అయితే వీటిపై సర్కార్ క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పింది.
- Advertisement -


