డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
Develop digital skills
రాయచోటి,
విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్ ను ఉపయోగించుకొని డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. బుధవారం రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఐసిఐసిఐ బ్యాంకు వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా అందించిన నిధులతో ఏర్పాటు చేసిన 20 కంప్యూటర్లు గల కంప్యూటర్ ల్యాబ్ ను మరియు ఆస్ట్రానమీ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూప్రస్తుతం మనం కృత్రిమ మేధ తో పోటీపడే ప్రపంచంలో ఉన్నామని, అందువల్ల డిజిటల్ నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐసిఐసిఐ బ్యాంకు వారు తమ నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను మరియు ఆస్ట్రానమీ లాబ్ను విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉపయోగించుకుని వృద్ధిలోకి రావాలన్నారు. ఐసిఐసిఐ బ్యాంకు వారు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఏపీ మోడల్ పాఠశాలకు ల్యాబ్ లను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.తాను చదువుకునేటప్పుడు ఇలాంటి అవకాశాలు లేవని ఇప్పటి విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే గొప్ప స్థాయికి వెళ్ళవచ్చని విద్యార్థులకు సూచించారు. కంప్యూటర్ను మరియు మొబైల్ ఫోన్లను మంచి విషయాలకు మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలని, సోషల్ మీడియాను ఉపయోగించవద్దని సూచించారు. అనంతరం పాఠశాలలో అన్ని వసతులు బాగున్నాయా లేదా అని విద్యార్థులను అడగగా అన్ని వసతులు బాగున్నాయని వారు జవాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డిఇఓ శివ ప్రకాష్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంకు రాయచోటి శాఖ మేనేజర్ ఏసుదాసు, తదితరులు పాల్గొన్నారు.
లేఅవుట్ల నిర్మాణాలు వేగం పెంచాలి :
రాయచోటి మండలం దిగువ అబ్బవరం “పీఎంఏవై – ఎన్టీఆర్ నగర్” గృహ నిర్మాణ లేఔట్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.బుధవారం రాయచోటి రూరల్ దిగువ అబ్బవరం “పీఎం ఏవై – ఎన్టీఆర్ నగర్” గృహ నిర్మాణ లేఔట్ లో జరుగుతున్న పనులను ఆకస్మితంగా తనిఖీ చేశారు. సదరు లేఔట్ మరియు ఏపీ మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న లేఔట్లలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రగతి, విద్యుత్ పోల్స్, మరియు లైన్ల ఏర్పాటు, నీటి వసతి, ఇతర మౌలిక వసతుల కల్పన, ఆర్చి నిర్మాణం తదితరాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీ చేశారు. చేపట్టిన పనులను ఈ మాసంతంలోగా నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పనుల పూర్తిలో భాగంగా రోజువారి ప్రగతిని తనకు తెలియజేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎస్ఈ దయాకర్ రెడ్డి, హౌసింగ్, డ్వామా పీడీ లు శివయ్య, వెంకటరత్నం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్నకుమార్, డిఆర్డిఏ పిడి సత్యనారాయణ, ఆర్ & బి ఎస్ ఈ సహదేవరెడ్డి విద్యుత్తు, హౌసింగ్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అనంతరం రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కార నిమిత్తం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రామాపురం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులలో వచ్చిన కొన్ని అర్జీలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బుధవారం రామాపురం మండలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రెవిన్యూ సదస్సులలో వచ్చిన అర్చీల పరిష్కారాల గురించి రామాపురం మండల తాసిల్దార్ కు తగు సూచనలు చేశారు.



