Thursday, February 26, 2026

హద్దులు చెరిపేసిన కుంభమేళ

- Advertisement -

హద్దులు చెరిపేసిన కుంభమేళ

A Kumbh Mela that erases boundaries

లక్నో, జనవరి 23, (వాయిస్ టుడే)
ఆధ్యాత్మికతకు ఎటువంటి సరిహద్దులులేవని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మరోసారి రుజువయ్యింది. రష్యా, ఉక్రెయిన్‌లు శత్రువులుగా మారి 1,000 రోజుల నుంచి రక్తపాత యుద్ధంలో చిక్కుకున్నప్పటికీ ఆ దేశాలకు చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కుంభమేళాలో ఒకే వేదికపై నుంచి ప్రేమ, శాంతి, కరుణల గురించి బోధిస్తున్నారు. వారే ఉక్రెయిన్‌కు చెందిన స్వామి విష్ణుదేవానంద గిరిజీ మహారాజ్, రష్యాకు చెందిన ఆనంద లీలా మాతా. ఇరువురూ ఒకే క్యాంపులో ఉంటూ రోజూ అనుగ్రహణ భాషణం చేస్తున్నారు. మహాకుంభ్ నగర్ సెక్టార్ 18లోని పైలట్ బాబా క్యాంపులో వీరు బసచేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వీరి ప్రసంగాల కోసం క్యూ కడుతున్నారు. ఉక్రెయిన్, రష్యాలకు చెందిన 70 మందికిపైగా భక్తులు ఈ క్యాంపులో కలిసే ఉంటున్నారు. రెండు దేశాల నుంచి మరో 100 మంది వరకు వస్తారని భావిస్తున్నారు.సాంప్రదాయ ప్రార్థనలు, రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతను అన్వయించడం గురించి చర్చలు వీరి ప్రసంగాల్లో ఉంటాయి. తమ దేశాల్లోని వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటారు. అదే సమయంలో ఆధ్యాత్మికత సార్వత్రిక స్వభావాన్ని నొక్కి చెబుతారు. స్వామి విష్ణుదేవానంద గిరిజీ మహారాజ్ ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ నగరానికి చెందిన వాలేరీ.. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం జునా అఖాడా మహామండలేశ్వర్‌గా ఉన్నారు. ‘‘భూమిపై అన్ని జీవుల మంచి, ఆనందం కోరుకునే ‘లోకః సమస్తః సుఖినో భవంతు’ అనే మంత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. మానవాళికి ‘సత్వ శక్తి’ లేదు. ధ్యానం ద్వారా ఒక సమాజంలో, దేశంలో, భూమిపై సత్వ శక్తి వ్యాపించినప్పుడు ప్రపంచం మంచిగా మారడం మొదలవుతుంది… ఇది స్వర్ణయుగమైన సత్య యుగం రాకకు వేదికను అందిస్తుంది’ అని అన్నారు.
ఆనంద మాత అసలు పేరు ఓల్గా. ఆమె పశ్చిమ్ రష్యాలోని నిజ్నీ నొవ్‌గోరోడ్‌కు చెందినవారు. ఆనంద మాత మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఐదో కుంభమేళా.. మొదటిసారి 2010లో మహామండలేశ్వర్ పైలట్ బాబా ఆహ్వానం మేరకు మొదటిసారి కుంభమేళాకు హాజరయ్యాను.. అప్పటి నుంచి ప్రతి కుంభమేళాకు వస్తూనే ఉన్నాను’ అని తెలిపారు.‘కుంభమేళా అనేది సాధువుగా జీవించడానికి.. శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం.. ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొనడానికి చాలా మంది సాధువులు వస్తారు. వేలాది మంది ప్రజలు తమ కర్మను, చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇదో మార్గం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నా శిష్యులను కలవడానికి, వారికి సనాతన ధర్మ సంస్కృతిని చూపించడానికి, అద్వైత వేదాంత, శైవ మతం, యోగా, ధ్యాన బోధనలను తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను’ అని ఆనంద మాత అన్నారు.‘రష్యా, ఉక్రెయిన్ ప్రజలు తమ జాతీయతకు అతీతంగా ఒకే వేదికపై సామరస్యంగా ఉండటం.. ఆధ్యాత్మికత ప్రజలను ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ’ అని ఆమె వ్యాఖ్యానించారు. గిరిజీ మహారాజ్, ఆనంద మాత ఇద్దరూ ప్రపంచ శాంతి, యుద్ధంతో ప్రభావితమైన దేశాల స్వస్థత కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. తమ దేశాల్లో నెలకున్న రక్తపాత సంఘర్షణ కారణంగా వారి సందేశం ప్రత్యేక వాణిని వినిపిస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్